Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం.. ఎందుకంటే..?

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం.. ఎందుకంటే..?
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో తను ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాడు.

Imran Khan: పాకిస్తాన్‌లో కక్ష రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశంలోని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవి నుంచి పదవీచ్యుతుడు కాక తప్పలేదు. పదవి నుంచి దిగిపోగానే షెహబాజ్ సర్కారు ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి షాక్ ఇస్తోంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఘోర అవమానంతో ప్రధాని పదవి నుంచి దిగిపోయిన ఇమ్రాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. ఏ క్షణంలోనైనా ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేస్తామని పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. దీంతో ఇమ్రాన్ జైలుకెళ్లడం ఖాయమైందా? అనేది ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు అధికారంలో ఉండగా నిధులు దుర్వినియోగం చేశాడంటూ ఇమ్రాన్‌ఖాన్‌పై కేసు నమోదైంది. ఇమ్రాన్‌ పార్టీ అయిన పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పీటీఐకి 7.32 లక్షల అమెరికా డాలర్ల విదేశీ నిధులు అందాయని ఆధారాలతో సహా పాకిస్తాన్ ఎన్నికల సంఘం వెల్లడించింది. 349 విదేశీ కంపెనీలు, 88 మంది వ్యక్తుల నుంచి ఈ నిధులు వచ్చినట్లు ఈసీపీ ఆరోపించింది. ఆమేరకు పీటీఐకి పాక్ ఎన్నికల సంఘం నోటీస్ కూడా పంపింది. నిజానికి పాకిస్తాన్‌లో రాజకీయ పార్టీలు విదేశీ నిధులు స్వీకరించడంపై నిషేధం ఉంది.

అయితే నిబంధనలకు తూట్లు పొడిచి, అధికార దుర్వినియోగం చేసి ఇమ్రాన్ నిషేధిత విదేశీ నిధుల సేకరించారని ఈసీపీ సహా ప్రతిపక్షాలు స్పష్టంచేశాయి. ఇదే సమయంలో ఇమ్రాన్‌ఖాన్ నిషేధిత విదేశీ నిధుల సేకరణ అభియోగాలపై కొన్నేళ్లుగా విచారణ కూడా జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఇమ్రాన్‌ను అరెస్టు చేయడంతో పాటు ఆయన పార్టీని పాకిస్తాన్ రాజకీయాల నుంచి బ్యాన్‌చేసే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు. ఇక.. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌ రూలింగ్‌ను తాము సవాలు చేస్తామని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ప్రతినిధులు అంటున్నారు.

తాము విదేశాల్లోని పాక్‌ జాతీయుల నుంచే నిధులు సేకరించామని.. అదేమీ చట్ట విరుద్ధం కాదని పీటీఐ ప్రతినిథులు చెప్పుకొచ్చారు. తమ పార్టీకి మొత్తం 13 ఖాతాలు ఉన్నాయని.. కావాలంటే వాటి వివరాలు చూసుకోవచ్చని సవాల్ విసిరారు. అమెరికా కుట్ర కారణంగానే తమ అధినేత ఇమ్రాన్‌ పదవి పోగొట్టుకొన్నారని ఆరోపించారు. మొత్తానికి దాయాది దేశంలో కక్ష రాజీకయాలతో పొలిటికల్ వార్ ముదురుతోంది. మరి ఇమ్రాన్‌ఖాన్‌ చేతులకు పాక్ సర్కారు సంకెళ్లు వేస్తుందా? ఆయన పార్టీని అక్కడి ఎన్నికల సంఘం బ్యాన్ చేస్తుందా? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story