Pakistan: పాకిస్తాన్‌లో మధ్యంతర ఎన్నికలు.. త్వరలోనే రాజకీయాల్లో ఊహించని పరిణామాలు..

Pakistan: పాకిస్తాన్‌లో మధ్యంతర ఎన్నికలు.. త్వరలోనే రాజకీయాల్లో ఊహించని పరిణామాలు..
Pakistan: పాకిస్తాన్‌లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీని రద్దు చేయాలంటూ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సిఫార్సు చేశారు.

Pakistan: పాకిస్తాన్‌లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. పాక్ అసెంబ్లీని రద్దు చేయాలంటూ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సిఫార్సు చేశారు. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ తోసిపుచ్చారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విదేశీయులు కుట్ర చేస్తున్నారని, ఈ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ నేషనల్ అసెంబ్లీకి గైర్హాజరు అయ్యారు.

మొత్తానికి అవిశ్వాస తీర్మానంలో జరిగే ఓటింగ్‌తో ఇమ్రాన్‌ను ఇంటికి పంపించేయొచ్చు అనుకున్న వారికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామంతో ఇప్పటికిప్పుడు పదవి కోల్పోలేరు ఇమ్రాన్‌ఖాన్. ఇక ప్రతిపక్షాలు ఎత్తుగడలు పారకముందే.. అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా సిఫార్సు చేశారు. దీంతో అధికార పక్షంతో సహా ప్రతిపక్షాలు మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

342 మంది సభ్యులుగల నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ మెజారిటీని కోల్పోయింది. దాదాపు 12 మందికిపైగా సొంత పార్టీ సభ్యులు ఆయనకు జలక్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు పంపించారు. వారు ఓటు వేయకుండా నిరోధించేందుకు పీటీఐ కోర్టును ఆశ్రయించింది. పైగా ఆఖరి బంతి వరకు పోరాటం చేస్తానని మొదటి నుంచి చెబుతున్నారు ఇమ్రాన్‌ఖాన్. అవసరమైతే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని కూడా చెబుతూ వస్తున్నారు.

పాక్ ప్రజలు సాధారణ మెజారిటీ ఇచ్చినా చాలు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం ఇమ్రాన్‌ఖాన్‌... కాసేపట్లో దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీతో సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా ఇమ్రాన్ మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకైతే ఇమ్రాన్‌ ఖాన్‌ ప్లానింగ్‌ ప్రకారమే పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. కాని, ఆర్మీ ఎంటర్‌ అయితే పరిస్థితి ఏంటన్నదే మిస్టరీ.

Tags

Read MoreRead Less
Next Story