Sri Lanka: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. అధ్యక్షుడి రాజీనామాపై ఒత్తిడి..

Gotabaya Rajapaksa (tv5news.in)
Sri Lanka: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో... అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోంది. అధ్యక్షుడి సెక్రటేరియట్ వద్ద నిరసనలు నిన్న కూడా కొనసాగాయి. నిరసనకారులు రాత్రంతా అక్కడే ఉండి 'గో హోమ్ గొట' అంటూ అధ్యక్షుడి రాజీనామా కోసం నినాదాలు చేశారు. తమకు కరెంట్, గ్యాస్, పెట్రోల్, మెడిసిన్ లేవు... అందుకే ఆందోళన చేస్తున్నామని తెలిపారు. రాజపక్సే రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు వ్యాఖ్యానించారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కొన్ని వారాలుగా శ్రీలంక ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పార్లమెంట్ సభ్యుల ఇళ్లను కూడా ఆందోళనకారులు ముట్టడించారు. కాగా... అధ్యక్షుడి రాజీనామా కోసం డిమాండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నాయని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు... ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎంపీల నుంచి ప్రతిపక్షం సంతకాల సేకరణను చేపట్టింది. ఇక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులు ఇవాళ అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు జరపనున్నారు. ప్రధానంగా ప్యాకేజీ, విదేశీ రుణాలను తిరిగి చెల్లించే విషయంలో సహకారం కోరే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com