Sri Lanka: శ్రీలంకలో చేయిదాటిపోయిన పరిస్థితులు.. ప్రధాని ఇంటికే నిప్పుపెట్టిన ప్రజలు..

Sri Lanka: శ్రీలంకలో చేయిదాటిపోయిన పరిస్థితులు.. ప్రధాని ఇంటికే నిప్పుపెట్టిన ప్రజలు..
Sri Lanka: శ్రీలంకలో పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఏకంగా ప్రధాని రాజపక్స ఇంటినే తగలబెట్టారు లంక ప్రజలు.

Sri Lanka: శ్రీలంకలో పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఏకంగా ప్రధాని రాజపక్స ఇంటినే తగలబెట్టారు లంక ప్రజలు. రాజపక్స పూర్వీకుల ఇళ్లను సైతం తగలబెట్టారు. దీంతో మరో దారి లేక ప్రధాని పదవికి రాజీనామా చేశారు మహేంద్ర రాజపక్స. ఆందోళనకారుల నెక్స్ట్ టార్గెట్ శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే. నిరసనకారులు విరుచుకుపడతారన్న సమాచారంతో.. అధ్యక్షుడి నివాస భవనాన్ని ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది.

అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఏ క్షణంలోనైనా అధ్యక్ష భవనాన్ని వేలమంది లంక ప్రజలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో మాజీ ప్రధానిగా మారిన మహేంద్ర రాజపక్స, అధ్యక్షుడు గొటబయ రాజపక్స.. దేశం విడిచిపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. జనం ఆగ్రహావేశాలు చూసి.. పోలీసులు సైతం పోలీస్‌స్టేషన్లను వదిలి పారిపోతున్నారు.

దేశంలో ఇంత హింసను చూడలేనంటూ ఓ బౌద్ధ గురువు.. నడిరోడ్డుపై నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల ఇళ్లను ప్రజలు కాలబెడుతున్నారు. వాళ్ల ఆఫీసులను సైతం వదలట్లేదు. కర్ఫ్యూ పెట్టినా, సైన్యాన్ని రంగంలోకి దించినా.. ప్రజల ఆగ్రహాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. జనం హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ, విధ్వంసం సృష్టిస్తున్నారు.

లంక ప్రజల ఆగ్రహావేశాలు చూసి, తనను చంపేస్తారేమోనన్న భయంతో ఓ ఎంపీ బలవన్మరణానికి పాల్పడ్డారు. మరోవైపు ప్రధాని రాజపక్స మద్దతుదారులు సైతం ఆందోళనకారులపై దాడులు చేస్తున్నారు. దీంతో లంక ప్రజలు మరింత రెచ్చిపోయారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఇతర అధికార పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసులు, వాహనాలను ఎక్కడికక్కడ తగలబెట్టేస్తున్నారు. చివరికి ప్రభుత్వ ఆఫీసులను సైతం వదలడం లేదు.

తాహతకు మించిన అప్పులు చేసిన శ్రీలంక.. ఆ అప్పులు తీర్చలేక దివాళా తీసింది. ఆహార ధాన్యాల దిగుమతులకు సైతం డబ్బుల్లేకపోవడంతో శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో జనం ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. ప్రధాని రాజపక్స సహా అధ్యక్షుడు సైతం రాజీనామా చేయాలంటూ జనం రోడ్లపైకి వచ్చారు.

చివరికి సొంత పార్టీ నుంచి సైతం రాజీనామా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో దేశాధ్యక్షుడు, ప్రధాని కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తున్న వారిపై రాజపక్స మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో 154 మంది నిరసనకారులు గాయపడ్డారు. దీంతో నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికార పార్టీకి సంబంధించింది అని తెలిస్తే చాలు.. తగలబెట్టి, విధ్వంసం సృష్టించారు.

అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి కారును నిరసనకారులు అడ్డుకున్నారు. ఆ నిరసనకారులపై ఎంపీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోవడంతో.. జనం ఊగిపోయారు. కారును తలకిందులుగా పడేశారు. కార్లోంచి ఎలాగోలా బయటపడ్డ ఎంపీ అమరకీర్తి.. దగ్గర్లోని బిల్డింగ్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి దాక్కున్నారు. అయినా సరే జనం ఊరుకోలేదు. వేలాది మంది ఆందోళనకారులు

బిల్డింగ్‌ను చుట్టుముట్టారు. జనం చంపేస్తారన్న భయంతో తన రివాల్వర్‌తో తనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఎంపీ అమరకీర్తి. అయితే, జనమే ఎంపీని నడిరోడ్డుపై హతమార్చారన్న వార్తలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపైనా జనం దాడికి పాల్పడుతున్నారు. చివరికి మాజీ మంత్రుల ఇళ్లు, ఆస్తులను కూడా వదలకుండా నిప్పుపెట్టారు.

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై అధికార పార్టీ నేతలు దాడి చేయిస్తున్నారని తెలిస్తే చాలు.. వాళ్లకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రధాని రాజపక్స తల్లిదండ్రుల స్మారకాలను సైతం ధ్వంసం చేశారు. ప్రధాని రాజపక్స అధికారిక నివాసం గేటు వద్ద కూడా ఆందోళనకారులు మంటలు రాజేశారు. ఆందోళనకారులు ప్రధాని నివాసం వరకూ వచ్చేయడంతో.. ఈ హింసాత్మక ఘటనల దాటికి ప్రధానే రాజీనామా చేయాల్సి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story