Sri Lanka Prime Minister: శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే.. ఆరోసారి ఆయనే..

Sri Lanka Prime Minister: ఓవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.. మరోవైపు భగ్గమంటున్న నిరసన జ్వాలలు. ప్రభుత్వంపై నిరసనలు, చెలరేగుతున్న హింసాత్మక ఘటనలతో రావణకాష్టంగా మారిన శ్రీలంక. కొన్నాళ్లుగా రాజకీయ అనిశ్చితితో అల్లాడుతోంది శ్రీలంక. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. తినడానికి తిండి కూడా దొరకక ప్రజలు రోడెక్కి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు.
ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న వేళ.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశాధ్యక్షుడు గొటబయరాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. మరో వారంలో కొత్త కేబినెట్ ఏర్పాటు అవుతుందని గొటబాయ తెలిపారు. విక్రమసింఘే గతంలో అయిదుసార్లు ప్రధానిగా పనిచేశారు.
కొత్తగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘేకకు శ్రీలంక పీపుల్స్ అలయన్స్ మద్దతు ప్రకటించింది. 225 సీట్లున్న శ్రీలంక పార్లమెంటులో యునైటెడ్ నేషనల్ పార్టీ తరఫున ఎన్నికైన ఒకే అభ్యర్థి రణిల్ విక్రమసింఘె. ఒకే పార్లమెంటు సీటు ఉన్నప్పటికీ ఆయనకు అన్ని పార్టీలు మద్దతు లభించింది. దీంతో ప్రధాని అయ్యారు. మరోవైపు ప్రధాని కుర్చీ దిగిన మహీందకు శ్రీలంక కోర్టు షాక్ ఇచ్చింది. మహీంద అండ్ ఫ్యామిలీ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది.
దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే సైతం పదవి నుంచి దిగిపోవాలని లంక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం దీనికి అంగీకరించడం లేదని స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ అనేక పర్యాయాలు ప్రధానిగా వ్యవహరించిన రణిల్ విక్రమ సింఘే ఆరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంకోభం నెలకొంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. వాణిజ్యం దారుణంగా పడిపోయింది.
నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. దీనంతటికి కారణం ప్రభుత్వమే అని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు రోడెక్కి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న రణిల్ విక్రమసింఘే ఎలాంటి పాత్ర పోషిస్తారు? తన అనుభవంతో దేశాన్ని ఏ విధంగా గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com