Russia Ukraine War : ఉక్రెయన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేసిన రష్యా..

Russia Ukraine War : ఉక్రెయన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేసిన రష్యా..
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. జపోరిజియా నగరంపై బాంబులతో విరుచుకుపడింది

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. జపోరిజియా నగరంపై బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 17 మంది వరకు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. అనేక మందికి గాయాలయ్యాయి.. పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.. 40 వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి.. ఉక్రెయిన్​ సైన్యం కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్‌ బలగాలు పేల్చేశాయి. ట్రక్కు బాంబులతో అ వంతెనను పేల్చేసినట్టు సమాచారం. ఈకారణంగానే దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే బ్రిడ్జిపై ట్యాంకర్‌ పేలడంతో కెర్చ్ వంతెన కూలినట్టు రష్యా ప్రభుత్వం చెబుతోంది.

అటు ఈ పేలుడుతో క్రిమియాతో రష్యాకు లింక్‌ తెగిపోయింది. బ్రిడ్జి పేల్చివేతపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. పేలుడులో ఉక్రెయిన్‌ పాత్ర ఉన్నట్టు తేలితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు అమెరికా సాయంతో ఉక్రెయిన్‌ బలగాలు ఈ వంతెనను పేల్చివేసి ఉండవచ్చని రష్యా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌ ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో జెలెన్‌స్కీ సైన్యం ఎదురుదాడిని ఉధృతం చేసింది. రష్యా ఆక్రమించిన అనేక ప్రాంతాలకు విముక్తి కలిగించింది. దొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించినా వాటిపై పూర్తి నియంత్రణను ఆ దేశం సాధించలేకపోతోంది. ముఖ్యంగా ఖేర్సన్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దళాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. పశ్చిమ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలతోనే ఉక్రెయిన్‌ సైన్యం పోరాడుతోంది.

ఉక్రెయిన్‌లో సైన్యానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతుండగా.. రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ క్షేత్రంలో దాడులకు నాయకత్వం వహించేందుకు కొత్త జనరల్‌ను నియమించింది. జనరల్‌ సెర్గీ సురోవికిన్‌ను ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ప్రాంతాల్లో 'జాయింట్ గ్రూపింగ్ ఆఫ్ ఫోర్సెస్ కమాండర్‌'గా నియమించినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. సైబీరియాలోని నోవోసిబిర్స్క్‌లో జన్మించిన సురోవికిన్. తజికిస్థాన్, చెచెన్యాతోపాటు సిరియాలో పోరాట అనుభవం ఉంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌లోని దక్షిణ దళాలకు నాయకత్వం వహించారు.

ఎదురు దెబ్బలు తగులుతున్నా రష్యా మాత్రం వెనక్కు తగ్గడం లేదు.. తనను ఇబ్బంది పెట్టిన అమెరికా సహా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన దేశాలకు గట్టిగానే బదులివ్వాలని పంతంగా ఉంది. అందుకే అణ్వాయుధాలను తెరపైకి తెచ్చి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. అయితే కేవలం భయపెట్టడానికే రష్యా ఈ మాటలు అని వుండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story