Russia : పంతం నెగ్గించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్..

Russia : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుకున్నట్లే చేశారు. అమెరికా, పశ్చిమ దేశాలు గగ్గోలు పెట్టినా వెనక్కు తగ్గలేదు. రెఫరెండం పేరిట ఉక్రెయిన్ సరిహద్దుల్లోని లుహాన్స్క్, దొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందాలపై నాలుగు రీజియన్ల సంబంధించిన నేతలతో కలిసి సంతకాలు చేశారు.
ఇందుకు సంబంధించిన విలీన ప్రక్రియను రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లోని సెయింట్ జార్జ్ హాలులో వేడుకగా నిర్వహించారు. సంతకాల తర్వాత పుతిన్, నలుగురు నేతలు చేయిచేయి కలిపి.. రష్యా, రష్యా'అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. వేడుకకు హాజరైన వందలమంది గొంతు కలిపారు.
కొత్తగా రష్యాలో విలీనం చేసుకున్న ప్రాంతాలను వదులుకునేది లేదని పుతిన్ తెగేసి చెప్పారు. ఈ ప్రాంతాలను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. వాటిని మళ్లీ చేజిక్కించుకుందామనే ఆలోచనను విరమించుకోవాలని పరోక్షంగా ఉక్రెయిన్, పశ్చిమ దేశాలను చురకంటిచారు. ఆ ప్రాంతాలపై దాడికి దిగితే, తమ భూభాగంపై దురాక్రమణకు దిగినట్టే భావిస్తామని... అందుకు ప్రతిగా అన్ని సాధనాలనూ'ప్రయోగిస్తామని, అణు దాడికైనా సిద్ధమేనని వార్నింగ్ ఇచ్చారు.
నాలుగు రిజీయన్ల విలీనఒప్పందాలను ఆమోదించేందుకు రష్యా పార్లమెంటు వచ్చేవారం సమావేశమవుతుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై అధ్యక్షుని హోదాలో పుతిన్ సంతకాలు చేస్తారు. మరోవైపు రష్యా దూకుడుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. నాలుగు రీజియన్లను తిరిగి కలుపుకుంటామన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాటో సత్వర సభ్యత్వ దరఖాస్తుపై జెలెన్‌స్కీ సంతకం చేశారు. ఉక్రెయిన్ భవిష్యత్తు యుద్ధక్షేత్రంలోనే నిర్ణయమవుతుందని పేర్కొంది. '
రష్యా విలీన ప్రకటనపై నాటో, ఐరోపా కూటమి మండిపడ్డాయి. ఇది చెల్లదని తెగేసి చెప్పాయి. రష్యా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని.. చట్టవిరుద్ధ రెఫరెండం, విలీన ప్రక్రియలను తాము గుర్తించబోమని యూరోపియన్ యూనియన్ ప్రకటించాయి. కాగా రష్యా ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసేలా అమెరికా, బ్రిటన్‌లు కఠిన ఆంక్షలు విధించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com