Russia Ukraine War : ఉక్రెయిన్‌కు అండగా అమెరికా.. మరింత తీవ్రమవుతోన్న యుద్ధం..

Russia Ukraine War : ఉక్రెయిన్‌కు అండగా అమెరికా.. మరింత తీవ్రమవుతోన్న యుద్ధం..
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి బుద్ధి చెప్పేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది

Russia Ukraine War : ఉక్రెయిన్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి బుద్ధి చెప్పేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది.. ఇప్పటికే యుద్ధంలో ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచిన అమెరికా.. ఆయుధాలను కూడా సమకూర్చుతోంది.. పెంటగాన్‌ నుంచి ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌కు 800 మిలియన్‌ డాలర్ల రక్షణ అందించింది.. ఇందులో కొన్ని మానవ రహిత తీర రక్షణ పడవలు కూడా ఉన్నాయి.. ఈ పడవల ద్వారానే కెర్చి వంతెన కూల్చివేసినట్లుగా రష్యా అనుమానిస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరఫరా చేయాలని నిర్ణయించింది.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ హామీ ఇచ్చారు.

రష్యా క్షిపణులతో కీవ్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో బైడెన్‌, జెలెన్‌ స్కీ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను జోబైడెన్‌ ఖండించారు. రష్యావి మతిలేని చర్యలంటూ విరుచుకుపడ్డారు.. ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఉక్రెయిన్‌కు అందనున్నాయి. ఈ విషయాన్ని అమెరికా వైట్‌ హౌస్‌ ప్రకటించింది. రష్యాకు తగిన బుద్ధి చెప్పేలా మిత్ర దేశాలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కూడా జెలెన్‌స్కీకి వివరించారు జోబైడెన్‌.

అయితే, ఇప్పుడు అమెరికా ఎలాంటి రక్షణ సాయం అందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.. గతంలో ఉక్రెయిన్‌కు నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిసైల్‌ సిస్టమ్స్‌ ఇచ్చేందుకు అమెరికా ఓకే చెప్పింది. ఈ వ్యవస్థకు రష్యా క్రూజ్‌ క్షిపణులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. అంతేకాదు, గతంలో 1,400 స్టింగర్‌ క్షిపణులు, నిఘా, మల్టిపుల్‌ మిషన్‌ రాడార్లను అగ్రరాజ్యం అందించింది. దీంతోపాటు మిత్రదేశమైన స్లొవాకియా సాయంతో ఎస్‌-300 వ్యవస్థ కూడా ఉక్రెయిన్‌కు అందింది. ఇవికాకుండా ఆగస్టులో జోబైడెన్‌ మరో ప్యాకేజీ ప్రకటించారు. వీటిల్లో 8 నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిసైల్‌ వ్యవస్థలున్నాయి. వీటిల్లో రెండు వ్యవస్థలు రెండు నెలల్లో ఉక్రెయిన్‌కు చేరే అవకాశం ఉంది.

ఇటు ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా ఒక్కొక్క దేశం ముందుకొస్తోంది.. ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది.. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను మాస్కో చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండిస్తూ.. అల్బానియా ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై రికార్డెడ్‌ ఓటింగ్‌ నిర్వహించాలని కోరింది. కానీ రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేసింది. మాస్కో డిమాండ్‌కు వ్యతిరేకంగా భారత్‌ సహా 107 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఓటు వేశాయి.

రష్యాకు అనుకూలంగా 13 దేశాలు ఓటు వేయగా.. 39 దేశాలు ఓటింగ్‌కు దూరమయ్యాయి. అయితే, ఓటింగ్‌ జరిగిన తీరును రష్యా తప్పు పడుతోంది.. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వలేదని అంటోంది.. మొత్తంగా రష్యా చర్యలను మెజారిటీ దేశాలు ఖండిస్తున్నాయి. అయితే, రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై వెనక్కు తగ్గేదే లేదని చెబుతోంది.దీంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఉత్కంఠను రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story