Sri Lanka Crisis : ఈనెల 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం : స్పీకర్ మహింద యాపా అబేవర్ధన

Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శ్రీలంకలో పాలనా బాధ్యతలు చేపట్టేందుకు రాజకీయ నేతలు వెనకడుగు వేస్తున్నారు. మేధావులు ముందుకు వచ్చేందుకు సాహసించడం లేదు. తీవ్ర సంక్షోభం.. సవాళ్లుగా మారిన లంకలో పాలన బాధ్యతలు చేపట్టేందుకు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ముందుకొచ్చారు.
గొటబాయ రాజపక్స అధికార పీఠం దిగిన వెంటనే అధ్యక్షుడిగా తాను పోటీ చేస్తానని తెలిపారు. ఇప్పటికే ఇతర రాజకీయ పార్టీలతోనూ ప్రేమదాస పార్టీ అయిన సమగి జన బలవెగయ ఎస్జేబీ చర్చలు జరిపింది. అన్ని పక్షాలతో కలిసి ఏర్పాటయ్యే తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు ప్రేమదాస అంగీకరించారని ఎస్జేబీ నేతలు తెలిపారు.
తాము ప్రజలను మోసం చేసేందుకు గద్దెనెక్కడం లేదని సజిత్ ప్రేమదాస తెలిపారు. సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేసేందుకు పక్కా ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. మరోవైపు కొత్త అధ్యక్షుడిని ఈ నెల 20న ఎన్నుకుంటామని స్పీకర్ మహింద యాపా అబేవర్ధన ప్రకటించారు.
అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రితో పాటు ఆయన కేబినెట్ రాజీనామాకు సిద్ధంగా ఉందని అధికార పార్టీ స్పష్టంచేసింది. పార్లమెంటులో దాదాపు 50 మంది ఎంపీలు ఉన్న ప్రేమదాస పార్టీకి.. ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తాయా? కొత్త ప్రభుత్వంలోనైనా శ్రీలంక.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com