Sri Lanka: శ్రీలంకలో కర్ఫ్యూ.. ముదురుతున్న సంక్షోభం..

Sri Lanka: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి లంకేయులు అత్యంత ఘోరమైన తిరోగమన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైన వస్తువుల దిగుమతులకు సైతం విదేశీ కరెన్సీ కొరత ఉండటంతో...దిక్కుతోచని స్థితిలోపడ్డారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటడం, కాగితం కొరతతో పరీక్షలు వాయిదా పడటం, డీజిల్ విక్రయాల నిలిపివేత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అటు రోజుకు 13 గంటల పాటు విద్యుత్ కోతతో పరిణామాలు సంక్లిష్టంగా మారాయి. అటు దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలంటూ ప్రజల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ అధ్యక్షుడు రాజపక్స గెజిట్ విడుదల చేశారు. జనం వీధుల్లోకి రాకుండా 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.
శ్రీలంకలో సంక్షోభాన్ని అధిగమించేందుకు అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తిని పెడచెవిన పెడితే కూటమి నుంచి బయటకు వస్తామని హెచ్చరించారు. అటు బస్సులు, ఇతర వాణిజ్య వాహనాలకు డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ప్రజా రవాణా కుంటుపడింది. ఇప్పటికే చమురు అడుగంటడంతో..అత్యవసర సర్వీసుల్ని సైతం ఇకపై నడపలేమంటూ ప్రైవేటు బస్సుల యజమానులు తేల్చి చెప్పారు.
ఆకలితో అల్లాడుతున్న లంకేయులకు మోదీ సర్కార్ ఆపన్నహస్తం అందిస్తోంది. మార్చి రెండో వారం నుంచి లంకకు ఐఓసీ చమురు సరఫరా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ లైన్ పొందాక ఆహార సహాయంగా 40 వేల టన్నుల బియ్యాన్ని పంపే ప్రక్రియను మొదలు పెట్టినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికైన తక్షణమే సరైన చర్యలు తీసుకోకుంటే దేశాన్నిపెను సంక్షోభం చుట్టుముట్టేందుకు మరెంతో సమయం లేదని విశ్లేషకులు చెబుతున్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com