Srilanka Crisis : లంక అధ్యక్షుడి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు

Srilanka Crisis : లంక అధ్యక్షుడి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన  ఆందోళనకారులు
Srilanka Crisis : శ్రీలంక మరోసారి అల్లకల్లోకంగా మారింది. ఆందోళనకారులు లంక అధ్యక్షుడు రాజపక్స ఇంట్లోకి చొచ్చుకెళ్లారు.

Srilanka Crisis : శ్రీలంక మరోసారి అల్లకల్లోకంగా మారింది. ఆందోళనకారులు లంక అధ్యక్షుడు రాజపక్స ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. దీంతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ అధ్యక్ష భవనం వదిలి పారిపోయారు. మరోవైపు ఆందోళనకారులను అడ్డుకునేందుకు శ్రీలంక ఆర్మీ టియర్ గ్యాస్‌ ప్రయోగించింది. నిరసనకారులపై లాఠీఛార్జ్‌ చేసింది. ఈ లాఠీఛార్జ్‌లో 26 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేయడానికి 20వేల మంది ఆర్మీ బలగాలు, పోలీసులను రంగంలోకి దింపారు. ఆందోళనకారుల దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

రెండు నెలలుగా శ్రీలంకలో కర్ఫ్యూ అమలవుతోంది. ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ ఎత్తేస్తారని తెలిసి.. వేల మంది నిరసనకారులు ముందుగానే ఆందోళనలకు ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టే.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వేల మంది రోడ్లపైకి వచ్చారు.

లంక ప్రజలు రెండు పూటలా తిని నెలలు గడుస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు ఇంకా ఆకాశాన్నంటే స్థాయిలోనే ఉన్నాయి. కనీసం విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకుందామన్నా డబ్బులు లేని పరిస్ధితి. ఎక్కడికి వెళ్దామన్నా పెట్రోల్ డీజిల్‌ కొరత వెంటాడుతోంది. కాని, అధ్యక్ష భవనం ముట్టడికి ప్రతిపక్షాలు ప్రైవేట్‌ బస్సులను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి మరీ కొలంబో నగరానికి ప్రత్యేక రైళ్లు వేయించారు ఆందోళనకారులు.

మే నెలలో అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన ఘటనలో 9 మంది ఆందోళనకారులు చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. ఆ ఘటన తరువాత ప్రధాని పదవికి రాజపక్సే రాజీనామా చేసి వెళ్లిపోయారు.

అధికార పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు, నేతలు ఉన్న ఇళ్లు, ఊళ్లు వదిలి పారిపోయారు. లంకలో ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామన్న అధ్యక్షుడు గొటబాయపై లంక ప్రజలు నమ్మకం కోల్పోయారు. దీంతో గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story