Ukraine: చర్నోబిల్ లాంటి ఘోర అణుప్రమాదంపై ఉక్రెయిన్ సూచనలు..

Ukraine: సోవియట్ కాలంలో నిర్మించిన జపొరిజియా భారీ అణు విద్యుత్తు కేంద్రం ఇప్పుడు కీవ్ గుండెలపై కుంపటిగా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తొలినాళ్లలో రష్యా సేనలు ఈ కేంద్రాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొన్నాయి. రియాక్టర్లపై కూడా దాడులు జరుపుతూ ఉక్రెయిన్‌ను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ క్షణాన అణుప్రమాదం చోటు చేసుకుంటుందో అని కీవ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొన్నాళ్ల క్రితం ప్లాంట్ ఉద్యోగులను ఇళ్లకు పంపించేసి ఓ దాడికి రష్యా ప్లాన్ చేసిందని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్లాంట్‌ను రష్యా బ్లాక్‌మెయిలింగ్‌కు ఉపయోగిస్తోందని పశ్చిమదేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు జపొరిజియాపై చర్చించేందుకు గురువారం రష్యా చట్టసభ భేటీ కానుంది. ఇక్కడ ఏ మాత్రం ఉద్రిక్తత పెరిగినా చర్నోబిల్ కంటే ఘోర ప్రమాదం చోటు చేసుకుంటుందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఛైర్మన్ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారినో గ్రోసీ హెచ్చరికలు జారీ చేశారు.
జపొరిజియా అణు ఇంధనం లీకయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంట్‌కు ఇప్పటికే సరఫరాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రియాక్టర్‌లో వాడే ఇంధన కడ్డీలను తగినంత చల్లబర్చకపోతే అవి కరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ కడ్డీల్లో యురేనియంను ఇంధనంగా వాడటంతో.. అది లీకయ్యే ప్రమాదం ఉంది. ఈ కడ్డీలు గనుక లీకైతే ఆ ప్రాంతం మొత్తం రేడియేషన్ వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com