Omicron: అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్క రోజులోనే..

Omicron: ఒమిక్రాన్ వైరస్‌దడ పుట్టిస్తోంది. కొత్త వేరియంట్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్క అమెరికాలోనే 24గంటల్లో ఐదున్నర లక్షల కరోనా కేసులు, 13వందలకుపైగా మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు ..భారత్‌లోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 16 వేల 764 కేసులు, 220 మరణాలు వెలుగుచూశాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 91 వేల 361గా ఉంది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి.
ఒక్క రోజులోనే కొత్త వేరియంట్ కేసులు 30 శాతం మేర పెరిగాయి. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్.. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 450 కేసులుండగా.. ఢిల్లీలో ఆ సంఖ్య 320కి చేరింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 374 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసులపై కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొవిడ్ తాజా కేసుల్లో అనూహ్య పెరుగుదలే ఇందుకు నిదర్శనం. గత కొన్ని రోజులుగా 10 వేలకు దిగువనే నమోదవుతున్న కేసులు.. తాజాగా 16 వేలకుపైగా చేరాయి. ఒమిక్రాన్ కేసులు సైతం భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com