BCCI కీలక నిర్ణయం.. IPL14 రద్దు..!

BCCI కీలక నిర్ణయం.. IPL14 రద్దు..!
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ IPLని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది.

ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని బీసీసీఐ రద్దు చేసింది. వేర్వేరు టీమ్ లలో 9 మంది ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బయో బబుల్ విధానం ఉన్నా ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఇక మ్యాచ్ లు కొనసాగించే అవకాశం లేదు. సన్ రైజర్స్, హైదరాబాద్ జట్లు ఇప్పటికే ఐసోలేషన్ లో ఉన్నాయి. ఇంకా ఐసోలేషన్ లో 8 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అందుకే రద్దు చేయక తప్పలేదు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ మేరకు ప్రకటించారు. ఐపీఎల్ లో మొత్తం 60 మ్యాచ్ లు ఉంటాయి. అందులో 29 మ్యాచ్ లు అయిపోయాయి. ఇంకా 31 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. కానీ వాటిని కొనసాగించే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. లీగ్ బయట కరోనా వైరస్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. బయో బబుల్ ఏర్పాటు వల్ల ఆటకు ఇప్పటివరకు ఎక్కడా అడ్డంకులు ఏర్పడలేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.

ఐపీఎల్ లో సగం సీజన్ సురక్షితంగా ముగిసింది అనుకునేలోపే క్రికెటర్లకు కరోనా సోకింది. తొలుత ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మ్యాచ్ ను వాయిదా వేశారు. తరువాత మరికొన్ని జాగ్రత్తలతో టోర్నీని కొనసాగిస్తామన్నారు. కానీ పరిస్థితిలో తేడా రావడంతో ఏకంగా టోర్నీనే రద్దు చేయక తప్పలేదు. ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ టీమ్స్ లో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ ఆటగాడు అమిత్ మిశ్రాకు కరోనా అని తెలియగానే.. జట్లన్నీ జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. కిందటేడాది యూఏఈలో ఐపీఎల్ టోర్నీ మొదలవ్వడానికి ముందే చెన్నై టీమ్ లో చాలామంది కరోనా బారిన పడ్డారు. తరువాత పరిస్థితులు చక్కబడ్డాయి. ఈసారి లీగ్ మొదలవ్వడానికి ముందే నితీశ్ రాణా, అక్షర్ పటేల్, దేవ్ దత్ పడిక్కల్, డానియల్ సామ్స్ లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు టోర్నీ మధ్యలో కూడా క్రికెటర్లపై కరోనా ఎఫెక్ట్ కనిపించింది.

కోల్ కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, టీమ్ పేస్ బౌలర్ సందీప్ వారియర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. వీరిలో వరుణ్ చక్రవర్తి జట్టు తరుపున అన్ని మ్యాచ్ లూ ఆడాడు. కానీ సందీప్ వారియర్ ఒక్కసారి కూడా గ్రౌండ్ లోకి దిగలేదు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కేకేఆర్ ఆటగాళ్లయితే.. హోటల్ గదుల్లోనే ఐదు రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లిపోవాల్సి వచ్చింది. నిజానికి బయో బబుల్ విధానం వల్ల ఎలాంటి సమస్య ఉండదని.. కరోనా రాదని తొలుత బీసీసీఐ చెప్పుకొచ్చింది. వరుణ్ బయటకు వెళ్లడం వల్లే అలా జరిగిందని చెప్పింది. అందుకే టోర్నీని ఎక్కువకాలం ఆపలేమని.. కరోనా వచ్చినవారిని ఐసోలేట్ చేయడం.. మిగిలినవారితో మ్యాచ్ లు కొనసాగించడమే సరైందని ముందుగా చెప్పింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రోజూ వాళ్లకు కరోనా పరీక్షలు చేయాలని కూడా నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఏకంగా టోర్నీనే రద్దు చేసింది.

ఐపీఎల్‌ కోసం బీసీసీఐ గత ఏడాదిలాగే ఈసారి కూడా ప్రత్యేక బయో బబుల్‌ ను ఏర్పాటు చేసింది. జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు వారికి సౌకర్యాలు కల్పించే కొందరు వ్యక్తులు మాత్రమే ఈ బబుల్‌లో ఉంటారు. నిర్ణీత సమయం పాటు.. క్వారంటైన్, వరుస పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితాలు వచ్చిన తర్వాతే.. అందరూ ఒక్కచోటికి చేరి ప్రాక్టీస్‌ చేస్తారు. అందుకే కొన్ని మ్యాచ్‌లు కొనసాగాయి. కానీ ఇప్పుడు కేసులు పెరగడం, ఇంకా మ్యాచ్ లు కొనసాగిస్తే.. మరికొంతమంది ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడతారేమో అన్న అనుమానంతో ఏకంగా టోర్నీనే రద్దు చేసింది.

ఇద్దరు క్రికెటర్లు బబుల్‌ను దాటి బయటకు రావడం వల్లే అక్కడే కరోనా ఎంటరై ఉండొచ్చని బీసీసీఐ భావిస్తోంది. భుజం గాయంతో వరుణ్‌ చక్రవర్తి బాధపడడం వల్ల.. స్కానింగ్‌ కోసం బయటకు వచ్చాడు. బబుల్‌ను దాటినా సరే.. గ్రీన్ ఛానల్ ప్రోటోకాల్ ను ఫాలో కావల్సిందే. అంటే.. బయో బబుల్‌లో భాగంగా ఉండే వాహనంలోనే.. అక్కడి సిబ్బంది సహాయంతో డైరెక్ట్ గా ఆసుపత్రికి వెళ్లాలి. కానీ ఈ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే వరుణ్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story