JJE Exams : జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను వాయిదా వేసే యోచనలో కేంద్రం

JJE Exams : దేశంలో కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా జేఈఈ-మెయిన్స్, నీట్ పరీక్షలకు వాయిదా వేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిని ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిర్వహించాలని కేంద్ర విద్యా శాఖ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంభించిన జేఈఈ-మెయిన్స్ పరీక్షలను జులై నెలాఖరు లేదా ఆగస్టులో నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే వైద్యవిద్య ప్రవేశ పరీక్షకు సంబంధించిన నీట్ ఎగ్జామ్‌ను సెప్టెంబరు వరకు వాయిదా వేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితులపై సమీక్షించిన తర్వాత వీటిపై తుది నిర్ణయం తీసుకోనుంది కేంద్రం.
అసలు జేఈఈ-మెయిన్స్ పరీక్షలను ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించాల్సి ఉంది. తొలి విడత ఫిబ్రవరిలోనూ, రెండో విడత మార్చిలోనూ... అలాగే మూడో విడత ఏప్రిల్, నాలుగో విడత మే నెలల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా జేఈఈ-మెయిన్స్, నీట్ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ పరీక్షలను మళ్లీ వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com