నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు

నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు
ఈ నెలతోపాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తంగా నాలుగు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2021–22 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ నెలతోపాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తంగా నాలుగు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏ సెషన్‌లోనైనా పరీక్షలు రాసుకునేలా, అన్నింటిలో ఉత్తమ స్కోర్‌ ఏది వస్తే దానినే పరిగణనలోకి తీసుకునేలా చర్యలు చేపట్టింది. ఇంగ్లిష్‌ మాత్రమే కాకుండా మొదటిసారిగా 12 భాషల్లో పరీక్షలను నిర్వహించనుంది.

తెలుగులో పరీక్షలు రాసేందుకు 374 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జేఈఈ మెయిన్‌ నిర్వహించినప్పుడు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవగా ఈసారి నాలుగు తేదీల్లో జరిగే మొదటి సెషన్‌లో 6 లక్షల 61 వేల 761 మంది పరీక్ష రాయనున్నారు. ఇంకా మూడు సెషన్లలో పరీక్షలు రాసే అవకాశం ఉండటంతో ఫిబ్రవరి సెషన్‌లో పరీక్షలు రాసే వారి సంఖ్య తగ్గింది. మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రెండో సెషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 27, 28, 29, 30 తేదీల్లో మూడో సెషన్‌ పరీక్షలు, మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నాలుగో సెషన్‌ పరీక్షలు జరగనున్నాయి

ఇవాల్టి నుంచి 26 వరకు జరిగే మొదటి సెషన్‌ జేఈఈ మెయిన్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు నాలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉండగా మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఏపీ విద్యార్థులు 87వేల797 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ నుంచి 73వేల782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం తెలంగాణలో 12 కేంద్రాలను, ఎన్‌టీఏ ఏర్పాటు చేసింది. తెలంగాణ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజమాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story