Bhatti : ‘కాక్ లోతి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మల్లు భట్టివిక్రమార్క

తెలుగు సాహితీక్షేత్రంలో విభిన్న రచనలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన రచయిత్రి ప్రొఫెసర్ సూర్యాధనంజయ్. వారి కవనంలోంచి జాలువారిన బంజారా సాహిత్య,సాంస్కృతిక వ్యాసాల గుచ్చం ‘కాక్ లోతి’.బంజారాల అస్తిత్వాన్ని అక్షరాలుగా మలిచిన ఈ గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాన్యులు శ్రీ మల్లుభట్టివిక్రమార్క గారు ప్రజాభవన్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు "వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ " ప్రొఫెసర్ సూర్యా ధనంజయ్ గారిని అభినందించారు.వైస్చాన్సలర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, ఎంత పని ఒత్తిడిలో ఉన్న ,తాను అభిమానించే, తనను నిలబెట్టిన బంజారా సాహిత్యాన్ని వదిలిపెట్టకుండా ఈ కాకోటిని చక్కగా రాశారని వారన్నారు.అంతేకాదు బంజారాల మూలాలను నమోదు చేసిన ఉత్తమ పరిశోధన గ్రంథాన్ని కొనియాడారు.
భారతీయ గిరిజన సాహిత్యంలో ఇదొక అపురూప గ్రంథమన్నారు.కనుమరుగైతున్న బంజారాల అరుదైన చరిత్రను, సాంస్కృతిక వైభవాన్ని నమోదు చేసిన రచయిత్రి ప్రయత్నం ఎంతో గొప్పదన్నారు.
రచయిత్రి ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ తన స్పందనను వినిపిస్తూ.. తాను పుట్టిన జాతి పట్ల సేవానిరతితో ఈ గ్రంథాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని దృఢ సంకల్పంతో తీసుకొచ్చానన్నారు.
శోధనకు దూరంగా ఉన్న అస్తిత్వ సంపదను తనవంతు కర్తవ్యంగా ఈ వ్యాసాలను పరిశోధనాత్మకంగా తీసుకొచ్చానన్నారు. ఈ వ్యాస సంపుటిని గౌరవనీయులు ఉపముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
మెహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాన్యులు బల్ రాం నాయక్ మాట్లాడుతూ బంజారా సాహిత్యాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన గ్రంథంగా కాకోటిని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ జిఎస్టీ నిపుణులు డా.ధనంజయ్ నాయక్ మాట్లాడుతూ ఆచార్య సూర్యాధనంజయ్ సాహిత్యంలో ఈ గ్రంథం ఒక మైలురాయి లాంటిదని ఇందులో చరిత్ర, సంస్కృతితో పాటు వీరగాథలు, బహుముఖ అంశాలు చోటుచేసుకోవడం విశేషమన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న భాషా సమ్మాన్ అవార్డు గ్రహీత డా.రమేష్ ఆర్య బంజారా సాహిత్య నిర్మాణానికి చారిత్రక మూలాల చమురును అందించిన గ్రంథంగా కాకోటిని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసన సభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తిక్ నాయక్, శీతల్ చౌహన్, పరిశోధకుడు, కవి డా.మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com