Telangana: కట్టుదిట్టంగా ఎంసెట్ పరీక్షలు

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మే 10 నుండి 14వరకు జరగనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 137 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం తెలంగాణలో 104, ఏపీలో 33, మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3. 20 లక్షల మందికి పైగా పరీక్షలకు హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచే అత్యధికంగా లక్షా 71వేల, 706 మంది పరీక్షలు రాయనున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 58 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
విద్యార్ధులు బయోమెట్రిక్ తప్పని సరిగా వేయాల్సి ఉంటుదన్నారు అధికారులు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ను, హాల్ టికెట్ మాత్రమే పరీక్షా హాలులోకి అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, చేతివాచీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. ఫొటో ఉన్న ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. ప్రతి సెంటర్‌లో సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం లేటైనా పరీక్షలకు అనుమతించేది లేదన్నారు అధికారులు.
మొదటి సెషన్‌లో పరీక్షకు ఉదయం 7.30 గంటల నుంచి, రెండో సెషన్‌లో పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందే చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో అదనపు బస్సులు నడపాలని సంబంధిత అధికారులకు ఉన్నత విద్య మండలి సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com