TSPSC Group 1 Notification 2022: గ్రూప్-1 నోటిఫికేషన్‌లపై క్లారిటీ.. ఎప్పుడంటే..?

TSPSC Group 1 Notification 2022: తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో మరో అడుగు ముందుకు పడుతోంది. గ్రూప్-1 ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లోనే విడుదల కాబోతోంది. రెండు మూడు అంశాల్లో ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. అట్నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే TSPSC నుంచి నోటిఫికేషన్ వెలువడబోతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు, భర్తీ అంశంపై నిన్న TSPSC బోర్డు సమావేశం సుదీర్ఘంగా జరిగింది.
19 శాఖల్లోని ఖాళీలపై అందిన వివరాల్ని పరిశీలించి వాటి భర్తీకి బోర్డు అంగీకారం తెలిపింది. గతంలో గ్రూప్-1 కేటగిరీలో లేని కొన్ని పోస్టులు కూడా ఇప్పుడు దీని కిందకే వచ్చాయి. జోన్లు, మల్టీజోన్లపై కొత్త గెజిట్ ప్రకారం రాష్ట్ర కేడర్ పోస్టులు కూడా మల్టీజోనల్‌కి మారాయి. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు పెరిగిన నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు 503 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
గ్రూప్-1 పరీక్షలకు ఈసారి ఇంటర్వ్యూలు లేవు. ప్రిలిమినరీ, మెయిన్స్ ప్రక్రియను 9 నెలల్లో పూర్తి చేసి ఉద్యోగాల్ని భర్తీ చేయాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలోనే ఈ ప్రక్రియ పూర్తికి సంబంధించిన టైమ్‌టేబుల్‌ను కూడా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక గ్రూప్-1కి సంబధించిన తొలి నోటిఫికేషన్ ఇదే కావడంతో కాంపిటిషన్ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com