GROUP 1: తెలంగాణలో నేటి నుంచే గ్రూప్ 1 మెయిన్స్

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. వీటిని వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ విధించారు. దీని ప్రకారం 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు తరలించే జీపీఎస్ అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించేలా రూట్‌మ్యాప్ రూపొందించారు.
నిబంధనలు ఇవే
563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్షలకు 31,383 మంది హాజరుకానున్నారు. అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌లతో తనిఖీ చేశాకే అనుమతించనున్నారు. హాల్‌టికెట్‌పై పేర్కొన్న సూచనలు తప్పనిసరిగా పాటించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలు తుది నియామకాలు పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించింది. ఇన్విజిలేటర్లు కచ్చితంగా పాటించాలంటూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
- అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ రంగు బాల్‌పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బరు, హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు తీసుకురావాలి. బొమ్మలు పెన్సిల్ లేదా పెన్‌తో వేయాలి. జెల్, స్కెచ్‌పెన్‌లు ఉపయోగించకూడదు.
- తొలిరోజు నుంచి చివరి రోజు వరకు ఒకే హాల్‌టికెట్‌ను ఉపయోగించాలి. మార్చి తీసుకొస్తే అనుమతించరు. హాల్‌టికెట్‌పై పేర్కొన్న స్థలంలో రోజూ అభ్యర్థితోపాటు ఇన్విజిలేటర్ సంతకం చేయాలి.
- జవాబులు రాసేందుకు ఆన్సర్ బుక్‌లెట్ ఇస్తారు. అదనపు పత్రాలు ఇవ్వరు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలోనే సమాధానాలు రాయాలి. వేర్వేరు భాషల్లో రాస్తే ఆ జవాబుపత్రాలను టీజీపీఎస్సీ అనర్హమైనవిగా ప్రకటిస్తుంది.
- స్క్రైబ్(పరీక్ష రాయడానికి సహాయకులు) అవసరమైన దివ్యాంగ అభ్యర్థుల హాల్ టికెట్లపై ‘స్క్రైబ్’ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొనడంతోపాటు, వీరి కోసం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ అభ్యర్థులకు అదనంగా గంట సమయాన్ని కేటాయిస్తారు. వీరు సదరం ధ్రువపత్రం తీసుకురావాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com