బీసీలకు అన్యాయం చేసిన జగన్ సర్కార్ : నారా లోకేష్

బీసీలకు అన్యాయం చేసిన జగన్ సర్కార్  : నారా లోకేష్
X

బీసీలకు ఎవరి పాలనలో న్యాయం జరిగిందో చర్చకు రావాలని బీసీ సంక్షేమ మంత్రికి నారా లోకేష్ సవాల్ విసిరారు. పత్తికొండ నియోజకవర్గంలో సాగుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా మారెళ్లలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత ముఖాముఖి నిర్వహించారు. బీసీల సమస్యలు విన్న లోకేష్.. జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. బీసీలకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కల్లు గీత కార్మికులపై కేసులు పెట్టి వేధిస్తోందని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. టైలరింగ్ వృత్తిలో ఉన్న బీసీలకు ఎలాంటి సాయం అందడం లేదన్న లోకేష్.. అధికారంలోకి వచ్చిన వెంటనే బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేరుస్తామని జగన్ మోసం చేసారని విమర్శించారు.

బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్లనేనని నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు బీసీలను పెద్ద ఎత్తున బీసీలను ప్రోత్సహించారని గుర్తుచేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే అని స్పష్టంచేశారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించామని.. ఆదరణ పథకం-2లో భాగంగా కొన్న పనిముట్లు బీసీలకు ఇవ్వకుండా జగన్ వేధించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్‌ను జగన్ కట్ చేశారని విమర్శించారు. 26 వేల మంది బీసీలపై జగన్ పాలనలో అక్రమ కేసులు పెట్టారని లోకేష్ మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని.. రూపాయి నిధులు లేని కార్పొరేషన్లను జగన్ ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బీసీలలో ఉన్న ఉపకులాల వారీగా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

జగన్ తన సొంత మద్యం అమ్ముకోవడానికి కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. కల్లు గీత కార్మికులను టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తామని.. ఉపాధి హామీని అనుసంధానం చేసి తాటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. మద్యం దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు ప్రత్యేకంగా షాపులు కేటాయిస్తామని చెప్పారు. బీసీలపై కేసులు పెట్టి వేధించే జగన్ నాలుగేళ్లుగా సొంత కుటుంబ సభ్యులు.. వివేకా హత్య కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సీబీఐ ఇప్పుడు భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారని.. అవినాష్‌రెడ్డి అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారని లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేంద్రంతో సంప్రదింపులు జరిపి సత్యపాల్ కమిటీ సిఫార్సుల మేరకు బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

రాయలసీమ సాగు, తాగునీరు కష్టాలు తీర్చడానికి కృషి చేసింది చంద్రబాబు మాత్రమేనని నారా లోకేష్ అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిందన్నారు. రాయలసీమ ప్రాజెక్టు కోసం చంద్రబాబు 11 వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ నాలుగేళ్లలో 10 శాతం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు తాను దత్తత తీసుకుంటానని చెప్పారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన యార్న్, కలర్ సబ్సిడీలను అందిస్తామన్నారు. చేనేతపై ఉన్న 5 శాతం ఉన్న జీఎస్టీని రద్దు చేస్తామని చెప్పారు. జగన్ పాలనలో చేనేత కార్మికులను దెబ్బతీశారని విమర్శించారు. బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు వెంటనే ఇంటికి వచ్చి అందజేసే విధానాన్ని తీసుకొస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

Next Story