క్షమించండి.. మళ్లీ ఇలాంటి పొరపాటు చేయను: ధన్‌రాజ్

కామెడీకి కూడా ఓ హద్దు ఉంటుంది. అన్నింటినీ ఒకే గాటన కట్టేస్తే ఇదిగో ఇలానే బుక్కవ్వాల్సి వస్తుంది. కమెడియన్ ధనరాజ్ తను చేసిన పొరపాటుకి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇటీవల ఓ స్కిట్ లో ధనరాజ్.. దీపావళి పండుగ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీప అనే అమ్మాయి అలీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్లే ఆ పండుగకు దీపావళి అనే పేరు వచ్చిందని స్కిట్ లో భాగంగా మాట్లాడాడు. దాంతో హిందూ సంఘాలు ధన్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ధన్‌రాజ్.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, దయచేసి అందరూ నన్ను క్షమించాలని వేడుకున్నాడు. కామెడీ కోసం, అందర్నీ నవ్వించే ఉద్దేశంతోనే అలా చేశానని.. అయితే అది ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదని, పండుగను కించపరిచే ఉద్దేశం ఎంత మాత్రం లేదని వివరణ ఇచ్చాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని, అందరూ తనని క్షమించాలని కోరాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com