Medico Preethi : మెడికో ప్రీతి కన్ను మూసింది

Medico Preethi : మెడికో ప్రీతి కన్ను మూసింది
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఈ నెల 22వ తేదీన మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

మెడికో ప్రీతి కన్ను మూసింది. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ప్రీతిని కాపాడేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయంది. హైదరాబాద్‌ నిమ్స్‌లో వెంటీలేటర్‌పై ఉంచి ఎక్మో సహయంతో ఐదు రోజుల పాటు చికిత్స అందించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో మెరుగైన చికిత్స కొసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.


ప్రీతిని పాడేందుకు ఎంతో ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదని చెప్పారు. తొలి రోజు నుంచి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. బ్రెయిన్ పనితీరు కాస్త కూడా మెరుగుపడలేదన్నారు. ఎక్మో పై ట్రీట్మెంట్ కావడంతో..శరీరం రంగులో కొద్దిపాటి మార్పు కూడా వచ్చిందని.. ఇక పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలిపారు.


వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఈ నెల 22వ తేదీన మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బాధితురాలిని ఎంజీఎం ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి. ప్రీతి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఇక ఆత్మహత్యకు యత్నించే ముందు ఆమె తన తల్లికి ఫోన్‌ చేసింది. ప్రీతి తన బాధను పంచుకుంది. ఈ ఫోన్‌ కాల్‌కి సంబంధించిన ఆడియో క్లిప్‌ బయటకు వచ్చింది. సైఫ్‌ తనతో పాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. సీనియర్లంతా ఒకటిగా ఉన్నారని... నాన్న పోలీసులతో ఫోన్‌ చేయించినా లాభం లేకుండా పోయిందని చెప్పింది. సైఫ్‌ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని తల్లికి తెలిపింది. ఇక ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపల్‌కి ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి తిట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే సైఫ్‌తో తాను మాట్లాడతానని.. ఇబ్బంది లేకుండా చేస్తానని తల్లి ఆమెతో చెప్పింది. ఇక అన్నిదారులూ మూసుకుపోవడంతోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.


నిందితుడు సైఫ్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సైఫ్‌కు వరంగల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఖమ్మం సబ్‌ జైలుకు తరలించారు. ఇక ప్రీతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story