ఉత్కంఠకు తెరపడింది.. అమ్మకే మళ్లీ పట్టం

తీవ్ర ఉత్కంఠ రేపిన సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది.

తీవ్ర ఉత్కంఠ రేపిన సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది.చివరికి మరోసారి సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించింది. పార్టీ నాయకత్వం మార్పుకోరుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేతలు లేఖ రాయడంతో ఈ రగడ మొదలైంది. దీంతో, ఈ రోజు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా ముందుగా మాట్లాడుతూ.. అందరం కలిసి కొత్త నాయకుడ్ని ఎన్నుకుందామని.. అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నానని అన్నారు. అయితే, తన వెనకుంటే సీనియర్లు రాసిన ఈ లేఖ తనను బాధించిందని అన్నారు. తరువాత మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంథోని సోనియానే అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరారు. తరువాత రాహుల్ మాట్లాడుతూ.. ఈ లేఖ రాయడం సమంజసం కాదని మండిపడ్డారు. ఓవైపు సోనియా ఆరోగ్యం సరిగా లేదని, మరోవైపు పార్టీ సంక్షోభంలో ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి లేఖ రాయడం తనను చాలా బాధించిందని అన్నారు. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను ఇలా మీడియా ముందుకు తీసుకురావడం సరికాదని అన్నారు. ఈ చర్యలన్నింటినీ చూస్తే.. బీజీపీతో కుమ్మక్కయ్యారనే అభిప్రాయానికి రావాల్సివస్తుందనే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాంనబీ అజాద్ తీవ్రంగా స్పందించారు. గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదని వారు గుర్తు చేసుకున్నారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని నిరూపిస్తే.. పార్టీకి రాజీనామా చేస్తానని గులాంనబీ అజాద్ సవాల్ చేశారు. అయితే, కొద్దిసేపటికే వారు తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. తమతో వ్యక్తిగతంగా మాట్లాడిన తరువాత బీజేపీతో కుమ్మక్కయ్యారనే వ్యాఖ్యలు రాహుల్ చేయలేదని తెలిసిందని కపిల్ సిబల్ అన్నారు. దీంతో ఈ వివాదం అక్కడితో సర్దుమణిగింది. కాగా.. చివరికి కొత్త బాస్ ను ఎన్నుకునే వరకూ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగుతారని సీడబ్ల్యూసీ ప్రకటించింది. ఆరు నెలల్లో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story