సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూసిన సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు..ఆయన స్థానంలో డి.రాజా బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి సురవరం సుధాకర్‌ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం మరో రెండేళ్లు ఉంది. అయితే అనారోగ్య కారణాలతో పదవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు సురవరం. దీంతో ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో డి. రాజాను పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన.. తమిళనాడుకు చెందిన డి.రాజా యువజన ఉద్యమాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన వయస్సు 72 ఏళ్లు. 1985లో సీపీఐ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. తమిళనాడులో పలు ఉద్యమాలకు నేతృత్వం వహించారు. 1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజాను ప్రతిపాదిస్తూ సురవరం ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని రాష్ట్రాల కార్యదర్శులు ఆమోదం తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నప్పటికీ కార్యదర్శివర్గ సభ్యుడిగా కొనసాగుతానని సురవరం చెప్పారు. రాజా నాయకత్వంలో పార్టీ పురోగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. AISF విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌తో పాటు, ఒడిశాకు చెందిన యువ నాయకుడు రామకృష్ణ పండాను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ, జాతీయ సమావేశాల్లో మొత్తం 13 అంశాలపై తీర్మానాలు చేసి ఆమోదించారు.

Tags

Read MoreRead Less
Next Story