వంట గ్యాస్ బాదుడు.. ఈ సారి ఎంత పెంచారంటే..!

వంట గ్యాస్ బాదుడు.. ఈ సారి ఎంత పెంచారంటే..!
కేవలం మూడునెలల్లో సిలిండర్ ధర 225 రూపాయలు పెరిగింది.

వంటింటి గ్యాస్‌ ధర వెయ్యి రూపాయల వైపు పరుగులు పెడుతోంది. కేవలం మూడునెలల్లో సిలిండర్ ధర 225 రూపాయలు పెరిగింది. మూడు నెలల క్రితం గ్యాస్ సిలిండర్ 650 రూపాయలకు వచ్చేది. కాని, మొన్న డిసెంబర్ ఫస్ట్ నుంచి గ్యాస్‌ సిలిండర్ ధరను పాతిక రూపాయల చొప్పున పెంచుతూ వస్తున్నారు. మధ్యలో ఓసారి ఏకంగా 50 రూపాయలు పెంచారు. సాధారణంగా హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌పై మాత్రమే ధరలు పెంచేవాళ్లు. కాని, ఈసారి వంటింటి గ్యాస్‌పైనా బాదుతున్నారు. మూడు నెలల్లోనే ఏకంగా 225 రూపాయలు పెరగడం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

మధ్య తరగతి వాళ్లు ఏడాదికి సగటున 10 సిలిండర్లు బుక్ చేసుకుంటారు. వీళ్లంతా 2వేల 250 రూపాయలు అదనంగా చెల్లించాల్సిందే. ఈ లెక్కన తమకు తెలియకుండానే, సిలిండర్‌ బుక్ చేయకుండానే రెండున్నర సిలిండర్లకు డబ్బులు చెల్లిస్తున్నారు. పోనీ, గ్యాస్‌ ధరలకు తగ్గట్టుగా సబ్సిడీ పెరుగుతోందా అంటే అదీ లేదు. ఒకప్పుడు గ్యాస్‌ బుక్ చేస్తే 120 లేదా 140 రూపాయలు తిరిగి వచ్చేవి. ఇప్పుడా రాయితీ 40 రూపాయలకు పడిపోయింది. చాలా వరకు ఆ 40 రూపాయలు కూడా తిరిగి ఇవ్వడం లేదు. దీంతో జనం కూడా తమకు సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడుతున్నాయన్న విషయాన్నే మరిచిపోయారు.

సాధారణంగా ఎన్నికల సమయంలో గ్యాస్ ధరలు పెరగకుండా కేంద్రం అడ్డుకుంటుంది. కాని, ఈసారి అలా కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా మరో పాతిక రూపాయలు బాదేశారు. దీంతో ఎన్నికలు ఉన్నా లేకున్నా గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉంటాయన్న సంకేతాలు ఇచ్చాయి. గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాలు ప్రొడక్షన్‌ను పెంచితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు. అటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అంతే. ఒపెక్ దేశాలు ముడిచమురు ఉత్పత్తిని పెంచితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదని కేంద్రం కూడా చెబుతోంది. ఉత్పత్తిని పెంచడానికి ఎంత లేదన్నా రెండు మూడు నెలలు పడుతుంది కాబట్టి.. ఈలోపు పెట్రో భారం తగ్గించేందుకు పన్నులు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రమే పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై పన్నులు తగ్గిస్తే తప్ప రేట్లు తగ్గేలా లేవు.

Tags

Read MoreRead Less
Next Story