ఆరోగ్య సంరక్షణలో మోడీ ప్రభుత్వం అద్భుత ప్రగతి: అమిత్ షా

భారతదేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధించిందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం దేశం లోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రాథమిక స్థాయి నుంచి తృతీయ స్థాయికి తీసుకువచ్చిందన్నారు.
కోవిడ్ వాక్సినేషన్, టెలీ మెడిసిన్, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ లేదా హెల్త్ రికార్డులను యాక్సెస్ చేయటం ఇలా అన్ని అంశాలు మోడీ హయాం లోనే దేశ పౌరులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. దేశంలోని 60 కోట్ల మంది ప్రజలకు ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య ఖర్చులు భరించవలసిన అవసరం లేకుండా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచితంగా అందే ఏర్పాటు చేసామన్నారు. అంతేకాకుండా జన ఔషధీ కేంద్రాల ద్వారా ఏకంగా 20 వేల కోట్లు ఆదా అయిందని వెల్లడించారు. ఇదంతా ఆరోగ్య వసతి సౌకర్యాలను మెరుగుపరచడం వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు. వైద్య విద్యారంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. 2013- 2014 సంవత్సరంలో దేశంలో 387 వైద్య కళాశాలలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 648కి చేరిందన్నారు. అలాగే ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 51 వేల నుంచి 99 వేలకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు 31 వేల నుంచి 64 వేలకు చేరుకున్నాయన్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా 22 వేల కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటయ్యా అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి విస్తరణ సమయంలో మనదేశంలో తయారైన 230 కోట్ల కరోనా వ్యాక్సిన్లను 130 కోట్ల మందికి వేయగలిగామని గుర్తు చేశారు. సమర్థుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆరోగ్యపరంగా బలంగా మారింది అనటానికి ఇది నిదర్శనమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com