సింధూ నాగరికతపై సినిమా తీయాలనుకున్నా: రాజమౌళి

ఆధునాతన నాగరికతకు బాటలు వేసిన సింధూ నాగరికతను వెండి తెరపై చూపాలని ప్రముఖ దర్శకుడు రాజమౌళి భావించారు. ప్రపంచానికి మన చరిత్రను తెలియాలని అనుకున్నాడు. ఈ ఆలోచన మగధీర సినిమా తీసినపుడే తనకు వచ్చిందని రాజమౌళి అన్నారు. ప్రస్తుతం సింధూ నాగరికతను ప్రపంచానికి తెలియాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధునిక నాగరికతలలో ఒకటైన సింధూ నాగరికతను వెండి తెరపై చూపే అంశాన్ని పరిశీలించాలని దర్శకుడు రాజమౌళికి ఆయన సూచించారు. దీంతో రాజమౌళి స్పందిస్తూ... తాను ఇది వరకు ఆ దిశగా ప్రయత్నించినట్లు ట్వీట్ చేశారు.
రామ్‌చరణ్ హీరోగా మగధీర సినిమాను రాజమౌళి తీశారు. ఈ సినిమాలో కొంత భాగాన్ని గుజరాత్‌లోని ధోలావిరా ప్రాంతంలో తీశారు. సింధూ నాగరికత ఉన్నత దశకు చేరుకున్న ప్రాంతాల్లో కూడా ఇదొకటి. ధోలావిరాలో శిలాజంలా మారిన ఓ చెట్టును తాను చూశానని ఆ చెట్టు చెప్పినట్లుగా సింధూ నాగరికత ఉత్థాన పతనాలను సినిమాగా తీయాలని అనుకున్నట్లు రాజమౌళి చెప్పారు. తరవాత కొన్నేళ్ళకు తాను పాకిస్తాన్ సందర్శించానని మెహంజోదారో ప్రాంతాన్ని సందర్శించేందుకు చాలా ప్రయత్నం చేశానని, అయితే తనకు అనుమతి లభించలేదని రాజమౌళి అన్నారు. సింధూ నాగరికతపై రాజమౌళి ట్వీట్ తరవాత నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. సింధూ నాగరికతపై రాజమౌళి సినిమా తీయాలంటూ చాలా మంది కోరుతున్నారు. ప్రపంచానికి మన నాగరికతను చాటి చెప్పగల సామర్థ్యం రాజమౌళికి మాత్రమే సాధ్యమని అంటున్నారు. మరి ఆ అద్భుత ఘట్టాలను రాజమౌళి తెరకెక్కిస్తారేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com