Actor Vikram: 'ఇంతకు మించి జీవితంలో నాకేమీ వద్దు'.. ఆరోగ్య సమస్యపై విక్రమ్ క్లారిటీ..

Actor Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ డెడికేషన్ ఎలా ఉంటుందో, సినిమాల కోసం ఆయన ఎంత కష్టపడతారో ఇప్పటికీ ఎన్నోసార్లు చూశాం. అయితే అలాంటి డెడికేటెడ్ యాక్టర్ అనారోగ్యానికి గురయ్యారు అని తెలియగానే తన ఫ్యాన్స్ అంతా విక్రమ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కానీ కొందరు మాత్రం తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ అసత్య ప్రచారాన్ని చేపట్టారు. దీనిపై విక్రమ్ స్పందించారు.
విక్రమ్‌కు స్వల్ప అనారోగ్యం వల్ల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యానికి కారణం తెలియక ముందే చాలామంది అది హార్ట్ ఎటాక్ అని సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ప్రచారం చేశారు. విక్రమ్ కుమారుడు ధృవ్.. రూమర్స్‌ను నమవద్దు, వ్యాప్తి చేయొద్దు అని చెప్పినా ఎవరూ వినలేదు. చివరికి విక్రమే స్వయంగా ఓ సెల్ఫీ వీడియోతో వారందరికీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా 'కోబ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న విక్రమ్.. మరోసారి తన ఆరోగ్య సమస్యపై నోరువిప్పాడు.
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'కోబ్రా' ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదల కానుంది. అందుకే మూవీ టీమ్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. పూర్తిగా కోలుకున్న విక్రమ్.. ఈ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఆ రోజు వచ్చిన వార్తలన్నింటినీ తాను చూశానంటూ తనపై వచ్చిన అసత్య ప్రచారం గురించి మాట్లాడారు విక్రమ్. జబ్బుపడిన వ్యక్తి ఫొటోలకు తన తలను పెట్టి మార్ఫ్ చేశారని, ఫేక్ థంబ్ నెయిల్స్ క్రియేట్ చేశారని అన్నారు. వారి క్రియేటివిటీ బాగుందని చెప్తూ వారికి థాంక్యూ తెలిపారు.
తన జీవితంలో ఇలాంటివి ఎన్నో అనుభవించానని గుర్తుచేసుకున్నారు విక్రమ్. అందుకే ఇవేమీ తనను పెద్దగా ఆందోళనకు గురిచేయలేదని తెలిపారు. తన కుటుంబం, స్నేహితులు, అభిమానులు తనకు అండగా నిలిచారని, ఇంతకు మించి జీవితంలో తనకేమీ వద్దు అని స్పీచ్‌ను ముగించారు విక్రమ్. ఇక విక్రమ్ పూర్తిగా కోలుకోవడం, నార్మల్‌గా ఉండడం చూసిన ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com