Rajinikanth: రజనీకాంత్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టే యోచనలో బీజేపీ..

Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారు. ఇదేదో సినిమాలో రోల్ కాదు. రియల్‌గానే రజనీ గవర్నర్ కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళనాడులో పునాదులు పటిష్టం చేసేకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టింది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ సొంతం చేసుకునే పనిలో పడింది కాషాయదళం. ఇందుకోసం తలైవా రజనీకాంత్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టాలనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో పాలిటిక్స్‌లోకి రావాలని హడావుడి చేసిన రజనీకాంత్, ఆఖరి నిమిషంలో వెనక్కితగ్గారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న రజనీ.. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కలిశారు రజనీ. గవర్నర్‌తో రాజకీయాలపై చర్చించానంటూ బహిరంగ ప్రకటన చేశారు రజనీ.
ఇదిలా ఉండగా ప్రధాని మోడీతో రజనీకి చిరకాల స్నేహం ఉంది. గతంలో మోడీ చెన్నై వచ్చినప్పుడు రజనీ నివాసానికి వెళ్లి చాలాసేపు ఆ కుటుంబంతో సరదాగా గడిపారు. ఈ సాన్నిహిత్యం కూడా రజనీని బీజేపీకి చేరువ చేస్తున్నట్లు తెలిసింది. బీజేపీ నుంచి వచ్చిన 'ఆఫర్'కు రజనీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరాలన్న బీజేపీ నేతల వినతిని తిరస్కరించిన రజనీ.. గవర్నర్ గిరీకి మాత్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవి అయితే ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరముండదు కనుక ఆయన ఓకే చెప్పినట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com