Golden Globe: రెడ్ కార్పెట్ పై మన కట్టూ బొట్టు...

గోల్డెన్ గ్లోబ్ వేదికపై భారతీయుడు సత్తా చాటుకున్నాడు. రెడ్ కార్పెట్ పై తెలుగుదనం మురిసింది. నిండైన చీరకట్టు, హుందాతనం ఉట్టిపడే షేర్వాణీలకు ప్రపంచమే సలామ్ కొట్టింది.
ఆర్ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకున్న సందర్భంగా చిత్ర బృందమంతా సతీసమేతంగా ఆ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ వారు ధరించిన వస్త్రాలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి.
రమారాజమౌళి, శ్రీవల్లి, ఉపాసన తెలుగుదనం ఉట్టిపడేలా నిండైన చీరకట్టుతో రెడ్ కార్పెట్ పై తళుకులీనడం భారతీయులకు గర్వకారణంగా నిలుస్తోంది. ఏమాత్రం హడావిడి లేకుండా మనిమల్ జువెల్రీతో వీరు రెడ్ కార్పెట్ పై నడిచిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక పడతుల పద్ధతికి తగ్గట్లుగానే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ షేర్వాణిలో తళుక్కుమన్నారు.
రాజమౌళి నలుపు కుర్తా ధరించి ఎరుపు దోవతిప్యాంట్‌లో మెరిసిపోతున్నారు. భార్య రమా కాంజీవరం చీరలో కనిపించారు. కీరవాణి నల్లటికుర్తా, పైజామా ధరించగా... శ్రీవల్లి మాత్రం బ్రైట్ ఎల్లో, ఆరెంజ్ కలర్ సారీలో ముస్తాబయ్యారు. ఎన్టీఆర్ బ్లాక్ సూట్, బౌటై కట్టుకొని హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఏమైనా ఆర్ఆర్ఆర్ టీమ్ స్టైల్ స్టేట్మెంట్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com