Golden Globe :"RRR" సినిమాకు అభినందనల వెల్లువ

Golden Globe :RRR సినిమాకు అభినందనల వెల్లువ
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కించుకున్న "నాటు నాటు సాంగ్"

RRR సినిమాకు "గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌" వరించగా సినీ ప్రముఖులు, సినీ ప్రియులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్" లో "నాటు నాటు సాంగ్" బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. కీరవాణి స్వయంగా పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

RRR సినిమాలోని పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం సంతోషం: పవన్ కళ్యాణ్

'నాటు నాటు...' పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామమని పవన్ కళ్యాణ్ అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన ఎం.ఎం.కీరవాణికి అభినందనలు. తెలుగు గీతానికి ఉన్న కీరిప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపచేస్తుంది. 'నాటు నాటు' గీతాన్ని రచించిన చంద్రబోస్, ఆలపించిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు. ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను, ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన దర్శకుడు రాజమౌళి, చిత్ర కథానాయకులు రాంచరణ్, ఎన్టీఆర్, నిర్మాత డి.వి.వి.దానయ్యలకు అభినందనీయులు అని ఆయన పేర్కొన్నారు.

నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివి: చంద్రబోస్‌

ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు గీత రచయిత చంద్రబోస్‌. తన జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివని చెప్పారు. 3వేల 500లకు పైగా పాటలు రాసిన తనకు.. ప్రతి పాట ఓ తపస్సు లాంటిదేనన్నారు. ఈసారి నాటు నాటు పాటకు చేసిన తపస్సుకు ఆ భగవంతుడే ప్రత్యక్షమై ఇచ్చిన వరం.. ఈ పురస్కారం అని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు చంద్రబోస్‌.

అవార్డు రావడం పట్ల హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్‌లో స్పందిస్తూ..కీరవాణీకి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు భారత సినిమా కల నెరవేరిందని తెలుపుతూ కీరవాణికి,రామ్‌చరణ్‌,ఎన్టీఆర్‌, రాజమౌళికితోపాటు సినిమా యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. రాజమౌళి, యూవీ క్రియేషన్స్‌ ఇలా ఒకరి వెంట ఒకరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story