Pop Singer Suicide: హాంకాంగ్‌ సింగర్‌ కోకో లీ ఆత్మహత్య

Pop Singer Suicide: హాంకాంగ్‌ సింగర్‌ కోకో లీ ఆత్మహత్య
X
హాంకాంగ్‌ గాయని కోకో లీ ఆత్మహత్య.... కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న పాప్‌ గాయని.... ఆస్కార్‌ వేదికపై ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్ అమెరికన్‌గా ఖ్యాతి...

ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్‌ అమెరికన్‌గా ఖ్యాతి గడించిన హాంకాంగ్‌ గాయని కోకోలీ కన్నుమూశారు. కోకో లీ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుందని.. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించిందని ఆమె సిస్టర్స్‌ కరోల్‌, నాన్సీ పేర్కొన్నారు. ఇటీవల పరిస్థితి మరింత దిగజారిందని, ఈ నెల 2 న ఇంట్లోనే 48 ఏళ్ల లీ ఆత్మహత్యకు యత్నించిందని చెప్పారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించామని, చనిపోయేంత వరకు కోకో లీ కోమాలోనే ఉందని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. ఆమెను రక్షించేందుకు వైద్య బృందం ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదని పోస్ట్‌లో వెల్లడించారు.


జనవరి 17, 1975న కోకోలీ హాంకాంగ్‌లో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ మిడిల్‌ స్కూల్‌లో చదువుకున్నారు. ఆసియాలో పాప్‌ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 30 ఏళ్ల కెరీర్‌లో కాంటోనీస్, ఆంగ్లంలో ఆల్బమ్‌లను సైతం విడుదల చేశారు. 2001లో హిడెన్‌ డ్రాగన్‌’లోని ఎ లవ్‌ బిఫోర్‌ టైమ్‌ సాంగ్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామిట్‌కావడంతో పాటు అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్‌ అమెరికన్‌గా నిలిచారు. 1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం చేసుకున్న తొలి చైనీస్ గాయనిగా నిలిచారు. ఆమె తర్వాతి ఆల్బమ్ కోకో లీ ఆసియాలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌గా నిలిచింది. 1997లో ఆమె మాండరిన్ ఆల్బమ్ సిన్సియర్‌తో పాటు కాంటోనీస్ ఆల్బమ్‌ను విడుదల చేసింది. 1998లో మాండరిన్ ఆల్బమ్ డి డా డి విడుదలవగా.. మూడు నెలల్లో మిలియన్‌ కాపీలు అమ్ముడయ్యాయి. ఆమె డిస్నీ మూలాన్ మాండరిన్ వెర్షన్‌లో హీరోయిన్ ఫా ములాన్‌కు గాత్రదానం చేసింది. రిఫ్లెక్షన్ అనే థీమ్ సాంగ్.. మాండరిన్ వెర్షన్‌ను పాడారు.


90వ దశకంలో అద్బుత గాత్రంతో సంగీత ప్రియులపై కోకో లీ బలమైన ముద్ర వేశారు. కాంటోనీస్, మాండరిన్, ఇంగ్లీషు భాషల్లో లీకి మంచి పట్టుంది. హాంకాంగ్, తైవాన్‌లలోనే కాకుండా సింగపూర్‌, మలేషియా, ఆస్ట్రేలియాలోనూ ఈ పాప్‌ గాయనికి చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రేమ, విశ్వాసం అని చేతుల మీద వేయించుకున్న టాటూల ఫొటోలను లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారిగా పోస్ట్ చేశారు. మీరు ఒంటరిగా లేరని, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నేను మీతో ఉంటానని ఆమె అభిమానలను ఉద్దేశించి మరో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ చూసి అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Tags

Next Story