Krishnam Raju : కృష్ణంరాజు గురించి ఆసక్తికరమైన విషయాలు..
Krishnam Raju : కృష్ణంరాజు మృతితో... గతంలో మరణం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి

Krishnam Raju : కృష్ణంరాజు మృతితో... గతంలో మరణం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దాదాపు 16 ఏళ్లక్రితం ఓ ఇంటర్వ్యూలో తానెలా చనిపోవాలనుకుంటున్నారో చెప్పారు కృష్ణంరాజు. 'పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని, నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ తుదిశ్వాస విడవాలనేదే నా కోరిక' అని కృష్ణంరాజు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇక కృష్ణంరాజుకు ప్రభాస్ అంటే ఎంతో ప్రేమ. తనకు కొడుకులు లేకపోవడంతో తమ్ముడి కొడుకైన ప్రభాస్‌ను తన సొంత కొడుకులా చూసుకునేవారు. ప్రభాస్‌ను ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ప్రభాస్‌ను వరుస అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్‌గా పేరును సాధించి.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగాడు. ఇక ప్రభాస్‌తో కలిసి నటించేందుకు రెబల్ స్టార్ మక్కువ చూపేవారు. ఈ క్రమంలో ఇద్దరు వెండితెరపై బిల్లా, రెబల్, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించారు.
ప్రభాస్ ఎదుగుదలను చూసిన కృష్ణంరాజు.. పెళ్లిని మాత్రం కళ్లారా చూడలేకపోయారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆయన ఆరాటపడ్డారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆశపడ్డారు. ప్రభాస్ పెళ్లి జరిగి.. పిల్లలు పుడితే వారితో నటించాలని ఎంతో ఆసక్తిగా ఉందంటూ తన మనసులో మాటను ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అలాగే.. మనవూరి పాండవులు లాంటి చిత్రంలో ప్రభాస్ నటిస్తే చూడాలని ఉందని కోరికను బయటపెట్టారు. కానీ, కృష్ణంరాజు తన కోరికలు తీరకుండా తుదిశ్వాస విడిచారు.
ఇక ఎదుటివారిని గౌరవించడంలో, అతిథులకు మర్యాద చేయడంలో కృష్ణంరాజు ఎప్పుడూ ముందుండేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. అదంతా తాను చేసిన ఓ తప్పువల్లే అని చెబుతుండేవారు కృష్ణంరాజు. తనకు పదహారేళ్లున్నపుడు ఓ వ్యక్తి నాన్నకోసం వచ్చారని...అపుడు తాను బల్లమీద కాళ్లుపెట్టి ఆఅతిథిని చూసి కూడా లేవలేదని.. కూర్చోనే ఆయన అడిగిన దానికి సమాధానం ఇచ్చానన్నారు. ఇంతలోనే బయట నుంచి వచ్చిన నాన్న... గోడకు తగిలించి ఉన్న కొరడా తీసి తనను బాదేశారని చెప్పారు. ఆ దెబ్బలకు ఐదు రోజుల వరకు తాను మంచం దిగలేదన్నారు కృష్ణం రాజు. ఎదుటివారిని గౌరవించాలనే సూత్రం అప్పుడే తనకు బోధపడిందని ఓసందర్భంలో బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.
కృష్ణంరాజు చదువులో ఎంత చురుకుగా ఉండేవారో స్టిల్ ఫొటోగ్రఫీలోనూ అంతే. తన స్వగ్రామైన మొగల్తూరు వాసులు, ప్రకృతిని తన కెమెరాలో బంధించేవారు. ఆ నెగెటివ్‌లను ఇంట్లోనే హైపోతో కడిగి, టార్చిలైట్ వెలుగులో ఎక్స్‌పోజ్ చేసేవారు. రెండు ఫొటోలు విడివిడిగా తీసి, వాటి నెగెటివ్‌లను కలుపుతూ మరో కొత్తఫొటో సృష్టించడంలాంటి ప్రయోగాలు ఆయనకు మహా సరదా. అలా ఆయన తీసిన ఫొటోలకు 'అండర్ సిక్స్‌టీన్ రాష్ట్రస్థాయి' పోటీల్లో బహుమతి కూడా వచ్చింది.
కృష్ణంరాజుకు కబడ్డీ, యోగా అంటే ప్రాణం. కోర్టు, ప్రత్యర్థులెవరు.. ఇలా మైదానంలో జరగబోయే దాన్ని ముందుగానే ఊహించుకుని, పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగేవారట. ఇక ఆటల్లో తానెప్పుడూ దురుసుగా ప్రవర్తించేవాడిని కాదని ఓ సందర్భంలో చెప్పారు కృష్ణంరాజు. రైడింగ్‌కు వెళ్లినప్పుడు ప్రత్యర్థిని ఓడించాల్సి వస్తే చాలామంది గట్టిగా కొడతారు... కానీ తాను మాత్రం ముక్కుమీద వేలుతో తాకి వచ్చేవాడినన్నారు. దీంతో తన స్నేహితులంతా 'ముక్కురాజు' అని ఆట పట్టించేవారని బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు కృష్ణంరాజు.
కృష్ణంరాజుకు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఖాళీ దొరికితే చాలూ ఏదో ఒక పుస్తకాన్ని చదివేవారు. వాటిల్లోని గొప్ప పాత్రలను 'తెర'పైకి తీసుకురావాలనుకునేవారు. అయితే, అలాంటి వాటిని రూపొందించేందుకు నిర్మాత దొరకడం కష్టమని ఒకానొక సమయంలో భావించారు. అందుకే 'గోపీకృష్ణా మూవీస్' అనే సంస్థను నెలకొల్పి, నిర్మాతగా మారారు. ఆ బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం 'కృష్ణవేణి'. 'పరిస్థితుల కారణంగా తప్పుచేసిన మహిళకు ఈ సమాజంలో బతకడానికి అవకాశం లేదా' అని ప్రశ్నిస్తూ తీసిన సినిమా అది. యాంటీ సెంటిమెంట్ కథ అని చాలామంది వారించినా కృష్ణంరాజు ఎవరి మాట వినకుండా తాను అనుకున్నది చేశారు. సినిమా విడుదలై, ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత ఆ బ్యానర్‌పై 'తాండ్ర పాపారాయుడు', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'భక్త కన్నప్ప', 'బిల్లా' తదితర ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి.