Kaali movie: కాంట్రవర్సీ సృష్టిస్తోన్న సినిమా పోస్టర్.. కాళీమాత చేతిలో సిగరెట్‌తో..
Kaali movie: భారత్‌లో.. హిందూ దేవతలపై.. ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీసి వివాదాలు చేయడం కొంతమంది డైరెక్టర్ల, నిర్మాతలకు ఫ్యాషన్ అయిపోయింది. తమ సినిమాను కాంట్రవర్శితో హైలెట్ చేసి సొమ్ము చేసుకోవాలన్న ఉద్ధేశ్యంతో.. వివాదాస్పద సినిమాలు తీస్తున్నారు. తాజాగా కాళి' పేరుతో తెరకెక్కిస్తోన్న ఓ డాక్యుమెంటరీ సినిమాపై తీవ్ర అభ్యంతరాలే వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో కాళి మాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి వివాదం సృష్టిస్తోంది డైరెక్టర్ లీనా మణిమేకలై.
ఈ పోస్టర్‌లో కాళికా మాత సిగరెట్ తాగడం, చేతిలో ఎల్జీబీటీలకు సంబందించిన జెండా పట్టుకోవడం వివాదవుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహాలో వేరే మతానికి చెందిన దేవుళ్లపై చిత్రీకరించే దమ్ము, ధైర్యం ఈ దర్శకురాలికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. హిందూ దేవతను అత్యంత దారుణంగా కించపర్చారంటూ మండిపడుతున్నాయి.
హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే అమ్మవారితో సిగరేట్ తాగుతున్న ఫోటోను సినిమా పబ్లిసిటీ కోసం వాడుకోవడం దారుణమంటున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనేక రాష్ట్రాల్లో లీనా పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. హిందువుల మనోభావాలు గాయపర్చిన లీనాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు.. డైరెక్టర్ లీనాపై ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. అయితే ఈ పోస్టర్ పై వెనక్కి తగ్గడం లేదు డైరెక్టర్ లీనా. కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు.
పైగా ఈ సినిమాను రాజ్యాంగం తనకు కల్పించిన ఆర్టికల్ 19(1) A వాక్ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు విడవడానికి రెడీ అంటోంది. తాను రిలీజ్ చేసిన పోస్టర్ పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటోంది. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తామంటోంది. లీనా తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. హిందువుల మనోభావాలు గాయపర్చిన లీనాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ట్విట్టర్‌లో లీనా మణిమేకలై అరెస్ట్ వార్త ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com