Kamal Haasan: 'ఇండియన్ 2'తో పాటు కమల్ ఖాతాలో మరో రెండు సీక్వెల్స్..
Kamal Haasan: నటుడిగా కమల్ హాసన్ ఒక విశ్వరూపం. అభినయానికి నాట్యవేదం. బాలనటుడిగా పరిచయమై, కథానాయకుడిగా ఎదిగి, ప్రవేశించిన ప్రతీ భాషాచిత్రాలలోనూ తనదైన సంతకంతో లెక్కలేనంతమంది అభిమానులను సొంతం చేసుకున్న విశ్వనటుడు. అయితే.. కొన్నేళ్ల పాటు సరైన విజయం కోసం సతమతమైన కమల్ విజయదాహాన్ని.. 'విక్రమ్' తీర్చింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్' పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
'విక్రమ్' ఇచ్చిన ఉత్సాహంతో విశ్వనటుడు వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. కమల్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ అంతా సీక్వెల్స్ తో నిండిపోవడం విశేషం. 'విక్రమ్' ముందే పట్టాలెక్కిన 'ఇండియన్2' అనివార్య కారణాలతో ఆగిపోయింది. అయితే.. 'విక్రమ్' భారీ విజయం సాధించడంతో మళ్లీ 'ఇండియన్2'ని లైన్లో పెట్టారు మేకర్స్. ఈనెల నుంచే కమల్-శంకర్ 'ఇండియన్2' తిరిగి పట్టాలెక్కే అవకాశాలున్నాయట.
'ఇండియన్2'తో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూపర్ హిట్టైన 'రాఘవన్' చిత్రానికి సీక్వెల్ ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నాడట కమల్. 2006లో విడుదలైన కమల్-జ్యోతిక యాక్షన్ డ్రామా 'రాఘవన్' మంచి విజయాన్ని సాధించింది. ఇటీవలే ఈ మూవీకి స్క్రిప్ట్ మొత్తాన్ని లాక్ చేశాడట డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఒక్కసారి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అట. కమల్ సీక్వెల్స్ లిస్టులో 'ఇండియన్2', 'రాఘవన్2' చిత్రాలతో పాటు 'విక్రమ్2' కూడా ఉంది.
ప్రస్తుతం ఇలయదళపతి విజయ్ తో సినిమాని తెరకెక్కించనున్న లోకేష్ కనకరాజ్.. ఆ తర్వాత 'ఖైదీ2', 'విక్రమ్ 2'లను వరుసగా కంప్లీట్ చేయనున్నాడు. ఇక.. కమల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'శభాష్ నాయుడు' కూడా త్వరలోనే తిరిగి పట్టాలెక్కనుందట. ఈ సినిమా కూడా 'దశావతారం' మూవీకి సీక్వెల్ అనుకోవచ్చు. అలా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ నాలుగు సీక్వెల్స్ తో బిజీ కాబోతున్నాడు విశ్వనటుడు. మరి.. 'విక్రమ్' తరహాలోనే ఈ సీక్వెల్స్ కూడా కమల్ కి భారీ విజయాలందిస్తాయేమో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com