Sachy: మరణించిన డైరెక్టర్ సినిమాకు 4 జాతీయ అవార్డులతో సత్కారం..
Sachy: ఇటీవల 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన జరిగింది. గత రెండేళ్లలో విడుదలయిన ఎన్నో సినిమాలకు అవార్డులు దక్కాయి. ఇక తెలుగులో చిన్న సినిమాగా విడుదలయ్యి జాతీయ అవార్డును అందుకుంది 'కలర్ ఫోటో'. దీంతో మూవీ టీమ్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇక మలయాళంలో కూడా ఓ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రానికి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. కానీ ఆ సంతోషాన్ని దగ్గరుండి చూడడానికి డైరెక్టర్ లేకపోవడం మూవీ టీమ్‌లో విషాదాన్ని నింపుతోంది.
మలయాళంలో రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం 'అయ్యపనుమ్ కోషియుమ్'. బీజూ మీనన్, పృథ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో హీరోలుగా నటించారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో దీనినే 'భీమ్లా నాయక్' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు పవన్ కళ్యాణ్. మలయాళంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సచిదానందన్ అలియాస్ సచీ తెరకెక్కించారు. సచీ గతేడాది జూన్‌లో హార్ట్ ఎటాక్‌తో మరణించారు.
ఇప్పుడు జాతీయ చలనచిత్ర అవార్డులలో అయ్యపనుమ్ కోషియుమ్ అవార్డుల పంట పండించింది. ఒక్క ఫోక్ సాంగ్‌తో సినిమాకు హైప్ తీసుకొచ్చిన నెంజయమ్మకు బెస్ట్ ఫిమేల్ సింగర్ అవార్డు దక్కింది.
యాక్షన్ కొరయోగ్రాఫర్ మాఫియా శశికి కూడా ఆ విభాగంలో అవార్డు దక్కింది. అయ్యప్పన్ పాత్రలో నటించిన బీజూ మీనన్‌కు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చింది. ఇక సచీకి కూడా ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com