Madonna: ఆస్పత్రి నుంచి మడోన్నా డిశ్చార్జ్‌

Madonna: ఆస్పత్రి నుంచి మడోన్నా డిశ్చార్జ్‌
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన పాప్‌స్టార్‌ మడోన్నా.. ఇన్‌ఫెక్షన్‌ బారినపడి ఆస్పత్రిలో చేరిన పాప్‌స్టార్‌.. మరిన్ని రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యులు

ఊహించని విధంగా తీవ్ర అస్వస్థతకు గురై ICUలో చికిత్స పొందిన పాప్‌ స్టార్‌ మడోన్నా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. తీవ్రమైన బాక్టిరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఆమెను న్యూయార్క్‌లోని ఆస్పత్రికి తరలించారు. చాలారోజుల పాటు ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందిన మడోన్నా క్రమంగా కోలుకున్నారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో న్యూయార్క్‌లోని ఇంటికి తీసుకువెళ్లారు. డిశ్చార్జ్‌ అయినా పాప్‌స్టార్‌ వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారని ఆమె మేనేజర్‌ వెల్లడించారు. మడోన్నా ఆస్పత్రిలో చేరారన్న వార్తతో సంగీత ప్రపంచం షాక్‌కు గురైంది. ఆమె త్వరగా కోలుకోవాలని వేలమంది సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు.


మడోన్నాకు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ సోకడానికి గల కారణాలను వైద్యులు స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆస్పత్రిలో చేరకముందు ఆమె పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పాప్‌స్టార్‌ శరీరం కూడా మొదట్లో చికిత్సకు స్పందించలేదని క్రమంగా పరిస్థితి మెరుగుపడిందని వివరించారు. తీవ్రమైన బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు సరైన చికిత్స అందించకపోతే అవయవాలు వైఫల్యం చెంది మరణం సంభవిస్తుందని వెల్లడించారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తులు, చర్మం, మూత్ర వ్యవస్థ, జీర్ణవ్యవస్థకు సోకి వాటి పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు వివరించారు.


మడోన్నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. ప్రపంచ యాత్రతో పాటు అన్ని టూర్లను కమిట్‌మెంట్‌లను తాత్కాలికంగా రద్దు చేశామని మడోన్నా మేనేజర్‌ గై ఓసీరీ వివరించారు. టూర్‌ కోసం కొత్త ప్రారంభ తేదీని, రీ షెడ్యూల్‌ చేసిన షో తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కెనడాలో జూలై 15న మడోన్నా ది సెలబ్రేషన్‌ టూర్‌ పేరుతో ప్రపంచయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఈ పర్యటన రద్దైంది. జులై 15నుంచి అమెరికా, యూరప్‌ నగరాల్లో మడోన్నా 84 ప్రదర్శనల ఇవ్వాల్సి ఉండగా దీని కోసం సంగీత ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మడోన్నాకు బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఈ పర్యటన ఆలస్యంగా ప్రారంభం కానుంది. మెక్సికోలో పలాసియో డి లాస్ డిపోర్టెస్‌లో 2024 జనవరి 30న మడోన్నా ది సెలబ్రేషన్‌ టూర్‌ ముగియనుంది.



మడోన్నా క్వీన్ ఆఫ్ పాప్‌గా ప్రపంచానికి సుపరిచితం. మహిళా పాప్ సింగర్స్‌లో మొట్టమొదటి బిలియనీర్‌గా ఆమె ఖ్యాతి గడించారు. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఆల్బమ్ అమ్మకాలతో మడోన్నా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు.

Tags

Read MoreRead Less
Next Story