Meena Sagar: ఈరోజు నేను ఆ ప్రమాణం చేస్తున్నాను: మీనా

Meena Sagar: ఇటీవల సీనియర్ నటి మీనా భర్త సాగర్ మరణం అందరినీ కలచివేసింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే తను జీవితంలో ఇంత విషాదం ఎలా తట్టుకోగలదని అభిమానులు దిగులుపడ్డారు. కానీ మీనా ఆ బాధ నుండి త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తోంది. గ్యాప్ లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. చిన్ననాటి స్నేహితులను కలుస్తోంది. ఇక తాజాగా మీనా పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మీనా భర్త ఊపిరితిత్తుల సమస్య వల్ల చనిపోయారని, సమయానికి తనకు అవయవాలు కూడా దొరకక ప్రాణాలు విడిచారని ఇప్పటికే కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. అయితే అలాంటి సమస్య ఇంకెవరికీ రాకూడదని మీనా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అవయవ దానం చేయాలనుకునేవారికి పిలుపునిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది మీనా.
'ప్రాణాలను కాపాడడం కంటే మంచి విషయం ఇంకేమీ లేదు. అవయవ దానం అనేది ప్రాణాలు కాపాడడానికి గొప్ప మార్గం. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రెండో అవకాశం ఇవ్వడం అనేది వరం లాంటిది. నా సాగర్‌కు అలాగే అవయవ దానం చేసేవారు దొరికుంటే నా జీవితం మరొకలాగా ఉండేది. ఒక డోనర్ 8మంది జీవితాలను కాపాడగలడు.'
'అందరికీ అవయవ దానం ప్రాముఖ్యత ఏంటో తెలియాలని ఆశిస్తున్నాను. ఈ విషయం కేవలం అవయవ దానం చేసేవారు, తీసుకునేవారు, డాక్టర్ల మధ్య ఉండేది కాదు. కుటుంబం, సన్నిహితులపై కూడా దీని ప్రభావం పడుతుంది. ఈరోజు నేను నా అవయవాలను దానం చేస్తానని మాటిస్తున్నాను. మనం ఎప్పటికీ బ్రతికి ఉండడానికి ఇదే గొప్ప మార్గం' అని పోస్ట్ చేసింది మీనా. దీంతో మీనా చేసిన పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com