Nepal Plane Crash: లైవ్ లో ... విమానం కూలిన దృశ్యాలు!
నేపాల్ విమాన ప్రమాదంలో 68 మృతదేహాలను వెలికితీశారు. నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన ప్రయాణీకుల్లో 53మంది నేపాలీ పౌరులు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఒక ఐరిష్, ఒక ఆస్ట్రేలియన్ ఉన్నట్లు చెప్పారు. అదివారం నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి కాస్కీలోని పొఖ్రాకు వెళ్తోన్న యెతి ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 68మంది ప్రయాణీకులు నలుగురు సిబ్బంది ఉండగా... వీరిలో ముగ్గురు చిన్నారులు, 62మంది పెద్దలు ఉన్నారు. యెతి ఎయిర్ లైన్స్ కు చెందిన ATR 72 విమానం ఆదివారం ఉదయం 10.30 గంటలకు నయాగాన్ వద్ద కూలిపోయింది.
రెస్క్యూటీం ఇప్పటివరకు 68 మృతదేహాలను బయటకు తీయగా మరో నాలుగు మృతదేహాల కోసం వెదుకుతున్నారు. ఇందులో 12 మృతదేహాలను గుర్తించారు. మిగితా మృతదేహాలను గుర్తించిన తర్వాత కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
మృతదేహాలను పోఖ్రా లోని పోఖ్రా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు తరలించినట్లు కస్కీ పోలీస్ చీఫ్ సూపరెండెంట్ అజయ్ తెలిపారు. గల్లంతయిన మృతదేహాల కోసం పోలీసు బలగాలు సేతీ నది కొండపై గాలిస్తున్నట్లు చెప్పారు.
ప్రమాదంపై అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్. విమాన ఘటనపై దర్యాప్తు చేసేందుకు సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి నాగేంద్ర ఘిమిరే ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
వీడియో బయటకు వచ్చింది :
విమాన దుర్ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు భారత్ కు చెందిన సోనూ జైస్వాల్ ఫేస్ బుక్ లైవ్ తో అక్కడి అందాలను చూపించసాగాడు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అరుపులు కేకలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్న ప్రయాణీకుల జీవితాలు అర్ధాంతరంగా ముగియడంతో నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com