Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో టైటానిక్‌ రీ రిలీజ్‌.. మండిపడుతున్న నెటిజన్లు

టైటాన్‌ దుర్ఘటన మరువక ముందే టైటానిక్‌ రిలీజ్‌... నెట్‌ఫ్లిక్స్‌పై మండిపడుతున్న నెటిజన్లు

వెండితెరపై ఆవిష్కరించిన అద్భతమైన ప్రేమ కావ్యం టైటానిక్‌. ప్రపంచ సినీ చరిత్రలోనే గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ చిత్రాన్ని జులై ఒకటినుంచి మళ్లీ విడుదల చేయాలన్న నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అట్లాంటిక్‌ మహా సముద్రంలో జలాంతర్గామి పేలిపోయిన దుర్ఘటన మరువకముందే.. టైటానిక్‌ను తమ ఓటీటీ వేదికగా జులై ఒకటిన అమెరికా, కెనడాల్లో రీ రిలీజ్‌ చేయాలన్న నెట్‌ప్లిక్స్‌ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఘోర ప్రమాదంలో అయిదుగురు మరణించిన దారుణాన్ని మరచిపోకముందే నెట్‌ఫ్లిక్స్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయం తనను ఆవేదనకు గురిచేసిందని ఓ యోజర్‌ ట్వీట్‌ చేశాడు. టైటానిక్‌ విడుదలకు ఇది సరైన సమయం కాదని మరో నెటిజన్‌ పోస్ట్ చేశాడు. ఈ నిర్ణయం భయంకరమైనది మరికొందరు విమర్శించారు.

అట్లాంటిక్‌ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో బయల్దేరిన మినీ జలాంతర్గామి టైటాన్‌ నీటి ఒత్తిడి వల్ల పేలిపోయింది. పాకిస్థాన్‌ బిలియనీర్‌ షెహజాదా దావూద్‌, ఆయన కుమారుడు సులేమాన్‌ , యూఏఈలో ఉంటున్న బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఫ్రెంచ్‌ మాజీ నావికా అధికారి పాల్‌ హెన్రీ, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ ఈ జలాంతర్గామిలో ప్రయాణించారు. వీరందరూ టైటాన్‌ పేలుడుతో మరణించారు.

ఇక టైటానిక్‌ సినిమా విషయానికొస్తే ప్రపంచమంతా మెచ్చుకున్న అద్భుతమైన వెండితెర ప్రేమకావ్యం. ఆ విషాద దుర్ఘటనకు ఓ అందమైన ప్రేమకథను జోడించి అందరి హృదయాలను హత్తుకునేలా చేశారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. 1997 డిసెంబరులో విడుదలైన ఈ మూవీ ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా అందరీ మనసుల్లో చెరగని ముద్ర వేసిందీ చిత్రం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్స్​తో సినిమాను ఉద్విగ్నభరితంగా చూపించారు కామెరూన్. ఈ చిత్రం సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు వారి నటన కూడా ప్రేక్షకుల్ని టైటానిక్‌ ప్రపంచంలో అంతే లీనమయ్యేలా చేసింది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరుతో విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకోనుంది.

Tags

Next Story