RAJ THARUN: ఆత్మహత్య చేసుకుంటా అంటూ లావణ్య లేఖ
హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య.. అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది. లావణ్య తరఫు న్యాయవాది అర్ధరాత్రి పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. రాజ్ తరుణ్ లేని ప్రపంచంలో తాను ఉండలేనని, కానీ అతడు మారిపోయాడని లావణ్య అన్నారు. పోలీసులకు సూసైడ్ లెటర్ పంపిన కాసేపటికే తన అడ్వకేట్‌తో లావణ్య చాట్ చేసింది. తాను వెళ్లిపోతున్నానని అంటూ మెసేజ్ పెట్టడంతో సదరు అడ్వకేట్ పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు లావణ్యను కాపాడారు.
మరో ఇద్దరిపై కేసు
తనను ప్రేమించి, మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా.. నటి మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపైనా కేసు నమోదైంది. ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మయాంక్‌లను చేర్చారు.
లావణ్య ఫిర్యాదు మేరకు.. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో ఆమెకు పరిచయం ఉందని, 2010లో ప్రపోజ్ చేసి, 2014లో రాజ్‌తరుణ్ పెళ్లి చేసుకున్నట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. రాజ్ తరుణ్‌ను తన కుటుంబం ఆదుకుందన్న లావణ్య.. రూ.70 లక్షలు రాజ్‌కు ఇచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొంది. 2016లో తాను గర్భం దాల్చానని.. తర్వాత అతడు అబార్షన్ చేయించినట్లుగా ఫిర్యాదులో వెల్లడించింది. నటి మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్ తన నుంచి దూరమయ్యాడని, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే.. మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని తెలిపింది. లావణ్య ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, 493, 506 కింద రాజ్ తరుణ్‌తో పాటు మాల్వీ, మయాంక్‌లపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com