Tom Holland: గే సీన్‌లో స్పైడర్‌ మ్యాన్‌ స్టార్‌... చెలరేగిన వివాదం

Tom Holland: గే సీన్‌లో స్పైడర్‌ మ్యాన్‌ స్టార్‌... చెలరేగిన వివాదం
X
ది క్రౌడెడ్‌ రూం సిరీస్‌లో గే సీన్‌పై వివాదం.... రెండు వర్గాలుగా చీలిపోయిన అభిమానులు....

స్పైడర్ మ్యాన్ స్టార్ టామ్ హాలండ్(Tom Holland)...అమండా సెయ్‌ఫ్రైడ్‌తో కలిసి నటించిన సైకో-థ్రిల్లర్ మిని సిరీస్ ది క్రౌడెడ్‌ రూమ్‌‍(The Crowded Room) వెబ్‌ సిరీస్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. 1981లో రచయిత డేనియల్ కీస్ రచించిన ది మైండ్స్ ఆఫ్ బిల్లీ మిల్లిగాన్ అనే నాన్-ఫిక్షన్ నవల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌(mini-series)ను తెరకెక్కించారు. ఈ వెబ్‌ సిరీస్‌లో టామ్ హాలండ్.. డానీ సులీవన్(Danny Sullivan) పోషించారు. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్(dissociative identity disorder) ఉన్న నేరస్థుడిపై ఆధారపడిన పాత్రను హాలండ్‌ సమర్థంగా పోషించాడు. 1979 వేసవిలో మాన్‌హట్టన్‌లో ఒక యువకుడని తీవ్రమైన నేరం కింద అరెస్ట్‌ చేస్తారు. అతను ఆ నేరాన్ని ఎందుకు చేశాడు... నిజంగా అతనే చేశాడా.. చేస్తే దాని వెనక ఉన్న కారణాలేంటీ అనేదే కథ. నేర పరిశోధకురాలు రియా గుడ్‌విన్‌ పాత్రలో అమండా సెయ్‌ఫ్రైడ్‌తో పాటు, సాషా లేన్ , ఎమ్మీ రోసమ్, థామస్ సడోస్కీ కీలక పాత్రలో నటించారు.


అయితే ఈ వెబ్‌ సిరీస్‌లో ఎలిజా జోన్స్‌తో టామ్ హాలండ్‌పై స్వలింగ సంపర్కంలో పాల్గొంటున్నట్లుగా ఉన్న సన్నివేశంపై అభిమానులు మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాలో టామ్ హాలెండ్‌కు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ వివాదంతో హాలెండ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. హాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు ఉన్న... చాలామంది యువతకు రోల్‌ మోడల్‌ అయిన టామ్ హాలండ్‌ ఇలాంటి సన్నివేశంలో నటించడం తనను విస్మయానికి గురి చేసిందని ఓ నెటిజన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టామ్ హాలండ్, మరో పురుషుడి మధ్య సన్నిహిత శారీరక సంబంధాన్ని మరో నెటిజన్‌ తీవ్రంగా విమర్శించాడు. ఇకపై టామ్‌ హాలండ్‌ను ఎవరూ స్పైడర్‌ మ్యాన్‌ అని పిలవరని.. ఎందుకంటే సూపర్‌ హీరోలు ఎవరూ LGBT పాత్రలు పోషించారని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. హాలండ్‌కు ఉన్న ఇమేజ్‌కు ఇలాంటి సన్నివేశంలో నటించాల్సిన అవసరం లేదని మరొకరు కామెంట్‌ చేశారు.


మరికొందరు నెటిజన్లు టామ్‌ హాలండ్‌కు మద్దతుగా నిలిచారు. సినిమా అన్న తర్వాత అన్ని పాత్రలు చేయాలని ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. టామ్‌ అద్భుతమైన నటుడన్న విషయాన్ని మరచిపోవద్దని గుర్తు చేస్తున్నారు. అతడిని ఇంకా స్పైడర్‌ మ్యాన్‌ నటుడిలానే చూడొద్దని, అతను నటుడని విభిన్నమైన పాత్రలు చేయడం అతడి వృత్తని మరో నెటిజన్‌ హాలండ్‌కు మద్దతుగా నిలిచాడు. ది క్రౌడెడ్ రూమ్ జూన్ 9న విడుదలైంది. ఇప్పటివరకూ మూడు ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. తదుపరి ఏడు ఎపిసోడ్‌లు వారానికొకటి చొప్పున విడుదల చేయనున్నారు. జూలై 28న క్రౌడెడ్ రూమ్ మినీ వెబ్‌ సిరీస్‌ ముగియనుంది.

Tags

Next Story