Varalaxmi Sarathkumar: 'వేరేవాళ్ల సంతోషం కోసం అలాంటి పనులు చేయవద్దు'
Varalaxmi Sarathkumar: సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్‌కుమార్. ముందుగా కోలీవుడ్‌లో తను హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసింది. కానీ అవేవి తనకు తగినంత గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. 'క్రాక్' చిత్రంలో జయమ్మ పాత్ర వరలక్ష్మి కెరీర్‌ను మలుపు తిప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వరలక్ష్మి హీరోయిన్‌గా పరిచయమయినప్పుడు నాజుగ్గానే ఉంది. కానీ మెల్లమెల్లగా తను బరువు పెరుగుతూ వచ్చింది. ఇక జయమ్మ తర్వాత వరుసగా అలాంటి పాత్రలే వస్తుండడంతో తనకు బరువు తగ్గాల్సిన అవసరం కూడా రాలేదు. కానీ కొన్నాళ్లుగా బరువు తగ్గడాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుంది వరలక్ష్మి. ఒక్కసారిగా నాజుగ్గా తయారయ్యి షార్ట్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి అందరికీ షాకిచ్చింది. తన లేటెస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వరలక్ష్మి.. దానికొక అందమైన క్యాప్షన్‌ను జతచేసింది.
'ఈ పోరాటం నిజం, ఈ ఛాలెంజ్ నిజం, నీకు కావాల్సింది సాధించకుండా నిన్ను ఏదీ ఆపలేదు. నీకు నువ్వే చాలెంజ్ చేసుకో. నిన్ను నువ్వే పోటీ అనుకో. అప్పుడు నువ్వు సాధించేది చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. 4 నెలలు కష్టాన్ని నేను ఇలా చూపించగలుగుతున్నాను. నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేయి. వేరేవాళ్లను సంతోషపెట్టే పనులు చేయకు. నువ్వేం చేయగలవో, ఏమీ చేయలేవో వేరేవాళ్లను నిర్ణయించనివ్వకు. ఆత్మస్థైర్యమే నీ ఆయుధం.' అని తన క్యూట్ వీడియోను షేర్ చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com