Anil Viswanth : పొలిమేర దర్శకుడి సినిమా హిట్టా ఫట్టా.. 28°C రివ్యూ

Anil Viswanth :  పొలిమేర దర్శకుడి సినిమా హిట్టా ఫట్టా.. 28°C రివ్యూ
X

రివ్యూ :28 డిగ్రీస్ సెల్సియస్

తారాగణం : నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి, ప్రియదర్శి, వైవా హర్ష, అభయ్, దేవయాని, జయప్రకాష్ తదితరులు

ఎడిటింగ్ : గ్యారీ బిహెచ్

మ్యూజిక్ : శ్రావణ్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు

నిర్మాత : సాయి అభిషేక్

దర్శకత్వం : డాక్టర్ అనిల్ విశ్వనాథ్

పొలిమేర, పొలిమేర2 చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్. అతను డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ 28 డిగ్రీస్ సెల్సియస్. కోవిడ్ పాండమిక్ కంటే ముందే పూర్తయిన ఈ చిత్రం అప్పట్లో ఆగిపోయింది. ఈ లోగా ఈ రెండు సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వనాథ్. ఆ గుర్తింపును ట్రంప్ కార్డ్ గా వాడుకుని తన ఫస్ట్ మూవీని ఇవాళ విడుదల చేశాడు. నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందనేది చూద్దాం.

కథ :

కార్తీక్ (నవీన్ చంద్ర)అనాథ. ఎమ్.బి.బిఎస్ చదువుతుంటాడు. మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ పై తన కాలేజ్ కే వచ్చిన మెడికల్ స్టూడెంట్ అంజలి(షాలిని) ని ప్రేమిస్తాడు. తనూ అతన్ని లవ్ చేస్తుంది. కానీ అనాథ అయిన కార్తీక్ ను అంజలి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయం అంటుంది. ఆ స్ట్రెస్ తో తను పడిపోతుంది. తలకు గాయమవుతుంది. ఆ క్రమంలో చేసిన టెస్ట్ ల కారణంగా తనకు బ్రెయిన్ లో ఓ ప్రాబ్లమ్ ఉన్నట్టు తెలుస్తుంది. దాని కారణంగా తన రూమ్ టెంపరేచర్ ఎప్పుడూ 28 డిగ్రీస్ సెల్సియస్ కు తగ్గకుండా, పెరగకుండా చూసుకోవాలి. తగ్గినా, పెరిగినా తను చనిపోతుంది. అయితే ఈ సమస్యకు జార్జియాలో చికిత్స ఉందని తెలుసుకుని ఇద్దరూ అక్కడికి వెళతారు. అక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటూ హాస్పిటల్ లో పనిచేస్తుంటారు. ఈ క్రమంలో ఓ రోజు షాలిని సడెన్ గా చనిపోతుంది. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో అనూహ్యమైన పరిణామాలు జరుగుతుంటాయి. మరి అవేంటీ..? షాలిని ఎలా చనిపోయింది..? దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే

28 డిగ్రీస్ సెల్సియస్ .. ముందు ఈ టైటిల్ సినిమాకు కొంత మైనస్ అనుకోవచ్చు. కామన్ పీపుల్ కు అర్థం కాదు. మాస్ కు తెలిసే ఛాన్స్ తక్కువ. సరే కొత్తగా ఉంది కదా టైటిల్ అనుకుని వెళితే.. టైటిల్ కు తగ్గ పాయింట్ తో ఆకట్టుకుంటాడు దర్శకుడు. కానీ ఆ పాయింట్ ను అర్థవంతంగా చెప్పడంలో బాగా నాన్చాడు. వెరీ స్లో నెరేషన్ తో ఫస్ట్ హాఫ్ అంతా ఏ మాత్రం ఇబ్బంది పెట్టని కథనంతో సాగిపోతుంది. అంటే సన్నివేశాలేవీ కొత్తగా అనిపించవు. అలాగని బోర్ కొట్టదు. లవ్ స్టోరీ రెగ్యులర్ గానే ఉంటుంది. ఆ పెళ్లికి అమ్మాయి తండ్రి నోచెప్పిన తర్వాత టైటిల్ కు తగ్గ పాయింట్ లోకి వస్తుంది కథ. హీరోయిన్ కిందపడి తలకు దెబ్బ తగులుతుంది. టెస్ట్ ల్లో ఆమె మెదడుకు గాయం అయిందని తేలుతుంది. ఈ కారణంగా తను ఓవర్ స్ట్రెస్ కాకూడదు. ముఖ్యంగా 28 డిగ్రీల టెంపరేచర్ కు ఎక్కువ, తక్కువ కాని వాతావరణంలోనే ఉండాలి. టెంపరేచర్ పెరిగినా తగ్గినా తను అరగంటలోపు చనిపోతుంది. ఇది పెద్ద కాన్ ఫ్లిక్ట్. అక్కడి నుంచి ట్రీట్మెంట్ కోసం కథ జార్జియా వెళుతుంది. అక్కడంతా నార్మల్ అనుకున్న తర్వాత తను చనిపోవడం.. తర్వాత అనూహ్యమైన సంఘటనలు జరగడం.. దీనికి పక్కింటి ఫ్యామిలీకి సంబంధం ఉండటం.. ఇవన్నీ చకచకా సాగిపోతాయి. ఓ రకంగా ఫస్ట్ హాఫ్ బాగా సాగదీసినా సెకండ్ హాఫ్ సగం నుంచి గ్రిప్పింగ్ గానే ఉంది స్క్రీన్ ప్లే. ముఖ్యంగా హీరో ఇంట్లో జరిగే సంఘటనలు ఓ దశలో హారర్ మూవీ చూడబోతున్నామా అనే ఫీలింగ్ నిస్తాయి. దాన్ని దాటుకుని చివర్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇదే సినిమాకు హైలెట్ అని చెప్పాలి.

మనం ప్రేమించిన మనిషి మనతో లేకపోయినా వారి జ్ఞాపకాలు ఉన్నా.. అది ప్రేమే అని చెప్పడంతో కథ ముగుస్తుంది.

నటన పరంగా నవీన్ చంద్ర బాగా చేశాడు. కృష్ణ అండ్ హిజ్ లీలతో ఆకట్టుకున్న షాలిని అంతకు ముందే చేసిన సినిమాలా ఉంది ఇది. తను అందంగా ఉంది, సహజంగా నటించింది. ఇతర పాత్రల్లో ప్రియదర్శి, అభయ్, హర్ష, జయ ప్రకాష్, రాజా రవీంద్రవి రొటీన్ రోల్స్. వాళ్లూ ఓకే అనిపించేశారు.

టెక్నికల్ గా మ్యూజిక్ బావుంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సెకండ్ హాఫ్ లో డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఎడిటింగ్ పరంగా చాలా కత్తెర్లు పడాల్సింది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ సగం వరకూ చాలా స్లోగా ఉంది సినిమా. దర్శకుడుగా అనిల్ విశ్వనాథ్ ఫస్ట్ మూవీ ది బెస్ట్ అని చెప్పలేం. కానీ ఓ కొత్త నేపథ్యంలో సరికొత్త కథ చెప్పే ప్రయత్నం చేశాడు. అంతే.

రేటింగ్ : 2.25 /5

- బాబురావు కామళ్ల

Tags

Next Story