Aay Movie Review : ఆయ్ మూవీ రివ్యూ

Aay Movie Review  :   ఆయ్ మూవీ రివ్యూ
X

రివ్యూ ః ఆయ్

తారాగణం ః నార్నే నితిన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపీ, వినోద్ కుమార్ తదితరులు

సంగీతం ః రామ్ మిర్యాల, అజయ్ అరసాద

ఎడిటింగ్ ః కోదాటి పవన్ కళ్యాణ్

సినిమాటోగ్రఫీ ః సమీర్ కళ్యాణి

నిర్మాతలు ః బన్నీ వాసు, విద్యా కొప్పినీడి

దర్శకత్వం ః అంజి కే మణిపుత్ర

పెద్దవాళ్లు కొట్టుకుంటున్నప్పుడు చిన్న పిల్లలు వెళితే నలిగిపోతారు అంటారు. బట్ టాలీవుడ్ లో అప్పుడప్పుడూ చిన్నవాళ్లే సత్తా చాటతారు. లేటెస్ట్ గా ఈ ఇండిపెండెన్స్ డే కు వచ్చిన నాలుగు సినిమాల్లో విజయం మాదే అంటూ సగర్వంగా నిలబడింది 'ఆయ్'మూవీ. గీతా ఆర్ట్స్ క్యాంపస్ కు చెందిన బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రాన్ని అంజి కే మణిపుత్ర దర్శకత్వం చేశాడు. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపీ, వినోద్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. నయన్ సారిక హీరోయిన్.

కథ ః

అమలాపురం ప్రాంతం నేపథ్యంలో అందమైన లొకేషన్స్ లో అద్భుతమైన సినిమాటోగ్రఫీతో చూస్తున్నంత సేపూ కనులవిందుగా ఉందీ మూవీ. ఓ ఆ ఊరి నుంచి అందరినీ వదిలి సాఫ్ట్ వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వెళతాడు కార్తీక్( నితిన్). లాక్ డౌన్ టైమ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంటికి వస్తాడు. ఇంటి వద్ద తండ్రి బూరయ్య (వినోద్ కుమార్) అంటే అతనికి కాస్త తక్కువ భావన ఉంటుంది. కార్తీక్ ఫ్రెండ్స్ సుబ్బు ( రాజ్ కుమార్ ) హరి (అంకిత్ ). ఓ రోజు అతను బస్ స్టాప్ లో పల్లవి (నయన్ సారిక ) ని చూసి ప్రేమలో పడతాడు. తన వెంట తిరిగి తననూ ఒప్పిస్తాడు. అంతా సెట్ అనుకునే టైమ్ కు కులం అడ్డుగా ఉందని హీరోయిన్నే ఈ పెళ్లి వద్దంటుంది. దీంతో కార్తీక్ అదోలాగైపోతాడు. పల్లవి తండ్రి కులం అంటే ప్రాణం ఇస్తాడు.. అవసరమైతే తీస్తాడు. మరి అలాంటి వ్యక్తిని వీరు ఒప్పించారా.. అసలు తమ కులం కాదని అన్న పల్లవి ఈ పెళ్లికి ఒప్పుకుందా.. చివరికి వీళ్లు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ ః

కొన్ని కథలు చూస్తున్నంత సేపూ అందులో లీనమైపోతాం. మంచి కథనానికి ఉండే లక్షణం ఇది. ప్రేక్షకులను తమవైపు లాగేసుకోవడం అనేది గొప్పగా రాసుకుంటే తప్ప అవదు. అలాంటి కథే ఆయ్. గోదారి జిల్లాల ప్రజల ఊతపదంగా కనిపించే ఆయ్ ని టైటిల్ గా పెట్టడంలోనే ఈ కథ అక్కడ ఎంత ప్యూర్ గా కనిపిస్తుందో చెప్పాడు దర్శకుడు. ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు. ప్రతి ఫ్రేమ్ బాగా కనిపిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలున్నాయి కానీ బోర్ కొట్టవు. బట్ అవి నేటి తరం యూత్ లో ఎక్కువగ కనిపించే అంశాలే అని చెప్పొచ్చు.

ఏ ప్రేమకథైనా స్నేహితుల సాయం లేకుండా విజయం సాధించదు. ఇది సినిమా సూత్రం. ఇందులో అదే హైలెట్ గా నిలుస్తుంది. ముగ్గురు స్నేహితుల మధ్య సరదాగా సాగిపోతూ ఆద్యంతం నవ్వులు పంచుతూ.. తమ స్నేహితుడి ప్రేమను గెలిపించేందుకు మిగతా ఇద్దరు చేసే తింగరి వేషాలు.. అన్నీ సహజమైన నవ్వులు పండిస్తాయి. కులం కంటే స్నేహం గొప్పది అనే సందేశాన్ని కూడా ఇందులో మిక్స్ చేశాడు దర్శకుడు. అది హీరో ఫ్రెండ్స్ తో పాటు హీరో, హీరోయిన్ తండ్రుల కోణంలోనూ చెప్పడం బావుంది.

"చిప్పుడు ఎవరికైనా తండ్రే హీరో. కానీ పెద్దయ్యాక కూడా తండ్రి హీరోనే అని తెలిస్తే ఆ కొడుకు పొందే గర్వం చాలా గొప్పగా ఉంటుంది" అని చివర్లో చెప్పించడం ఎమోషన్ ను పంచుతుంది. సింపుల్ గా సాగుతూ ఎక్కడా హెవీ డోస్ లేకుండా మెలో డ్రామా ఛాయలే కనిపించకుండా.. ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు అంజి సకుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు.

రామ్ మిర్యాల, అజయ్ అరసాద సారథ్యంలో సంగీతం వీనుల విందుగా ఉంది. సోఫియానా అనే పాటలో రామ్ గాత్రం మైమరపిస్తుంది. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. మాటలు, లొకేషన్స్ సహజంగా కనిపిస్తాయి. దర్శకుడిలో చాలానే విషయం ఉందనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి అద్భుతమైన కథ రాసుకున్నాడు.

ఫైనల్ గా ః గొప్ప కుటంబ కథా చిత్రమండీ.. ఆయ్

రేటింగ్ ః 3/5

- బాబురావు. కామళ్ల

Tags

Next Story