A.R.M Movie Review : ఏ.ఆర్.ఎమ్ మూవీ రివ్యూ
రివ్యూ : ఏ.ఆర్.ఎమ్ (A.R.M)
ఆర్టిస్ట్స్ : టోవినో థామస్, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్, జగదీష్, ప్రమోద్ శెట్టి, రోహిణి తదితరులు
ఎడిటర్ : షమీర్ మహ్మద్
సంగీతం : ధిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫీ : జామోన్ టి జాన్
నిర్మాతలు : లిస్టిన్ స్టీఫెన్, జకారియా థామస్
స్టోరీ, స్క్రీన్ ప్లే : సుజిత్ నంబియార్
దర్శకత్వం : జతిన్ లాల్
సౌత్ నుంచి ప్యాన్ ఇండియా హీరోలు పెరుగుతున్నారు. మళయాలం నుంచి ఒకప్పుడు మోహన్ లాల్, మమ్మూట్టి వంటి వాళ్ల సినిమాలు దేశవ్యాప్తంగా డబ్ అయ్యాయి కానీ.. ప్యాన్ ఇండియా హీరోలు అనలేం. ఈ జెనరేషన్ లో ఆ ఇమేజ్ తెచ్చుకుంటోన్న హీరో టోవినో థామస్. ఆ మధ్య మిన్నల్ మురళి అనే సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీతో ఆకట్టుకున్నాడు. తర్వాత 2018 అనే మూవీతో కంట్రీ మొత్తాన్ని మెప్పించాడు. తాజాగా ప్యాన్ ఇండియా ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుని ఏఆర్ఎమ్ అనే మూవీతో వచ్చాడు. అంటే ‘అజయంతే రండమ్ మోషనమ్’అని అర్థం. తెలుగులో అయితే అజయ్ చేసిన రెండో దొంగతనం అని అర్థం. ఈ గురువారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ :
19వ శతాబ్దం ఆరంభంలో కేరళలోని ఒక ప్రాంతంలో ఆకాశం నుంచి ఒక చుక్క రాలి పడుతుంది. ఆ శకలంలో అత్యంత విలువైన వస్తువులుంటాయి. ఈ విషయం తెలిసిన ఆ ప్రాంత రాజు అక్కడికి వెళ్లి ఆ శకలాన్ని తీసుకువచ్చి కొన్ని రహస్య అంశాలతో ఒక దేవత బొమ్మ తయారు చేసి తన వద్దకు తీసుకువెళతాడు. అదే సమయంలో విదేశీ ముసల్మానులు ఆ రాజ్యంపై దండెత్తడానికి వస్తారు. రాజు తన బావమరిదిని యుద్ధానికి పంపిస్తాడు. అతన్ని ముసల్మానులు బంధిస్తారు. వారిని విడిపించేందుకు తోక చుక్క పడిన గ్రామానికి చెందిన ‘కలరి’ యుద్ధ విద్య యోధుడు కుంజికేలు( టోవినో థామస్)ను పంపిస్తారు. ఒక్కడే అందరినీ చంపేసి రాజు బావమరిదితో పాటు సైన్యాన్ని తీసుకు వస్తాడు. అందుకు ప్రతిగా ఏదైనా బహుమతి కోరమంటాడు రాజు. కుంజికేలు ఆ విగ్రహం కావాలంటాడు. రాజుకు ఇష్టం లేకపోయినా ఇస్తాడు. ఆ విగ్రహాన్ని తెచ్చి తన ఊరిలో ప్రతిష్టిస్తాడు. ఆపై కుంజికేలు ఊరికి కలరా సోకి అంతా చనిపోతారు. కేలుకూ ఆ వ్యాధి సోకుతుంది. చివరి నిమిషంలో ఉండగా రాజు బావమరిది ఓ రహస్యాన్ని అతనికి అందిస్తాడు. అది చూడగానే కుంజికేలు మరణిస్తాడు.
1950 ల కాలంలో మణియన్ (టోవినో థామస్) అదే ఊరికి చెందిన దొంగ. అతని వంశం అంతా దొంగలే అని ఊరంతా ఈసడిస్తారు. ఆ మణియన్ ది తక్కువ కులం అని ఆ విగ్రహం ఉన్న గుడికి రానీయరు. ఓసారి గుడికి వెళ్లిన మణియన్ భార్యను అవమానిస్తారు. అందుకు ప్రతీకారంగా మణియన్ విగ్రహాన్నే దొంగిలించి దాని స్థానంలో వేరేది పెడతాడు. గ్రామస్తులకు ఇది తెలిసి అందరూ కలిసి చంపేస్తారు. కానీ అతనితో పాటు భార్యకు మాత్రమే తెలిసిన ఒక నిజం అలాగే సమాధి అవుతుంది.
1990ల కాలంలో మణియన్ మనవడు అజయ్ (టోవినో థామస్) ఆ ఊరి పెద్ద కూతురు లక్ష్మి(కృతిశెట్టి)ని ప్రేమిస్తాడు. అయితే తాత కారణంగా ఊరంతా తననూ దొంగలానే చూస్తుంది. ఇది అతనికి నచ్చదు. తనకు నచ్చిన పని చేసుకుంటున్నా.. అవమానాలకు గురవుతాడు. అలా ఓ సారి 19వ శతాబ్దానికి చెందిన రాజు వారసుడు ఆ ఊరికి వచ్చి తనకు ఆ విగ్రహాన్ని తెచ్చివ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు.
ఇదీ కథ. అయితే కుంజికేలుకు రాజు బావమరిది చెప్పిన రహస్యం ఏంటీ..? మణియన్ కు మాత్రమే తెలిసిన నిజం ఏంటీ..? అజయ్ విగ్రహాన్ని తెచ్చే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలేంటీ అనేది కథనం.
విశ్లేషణ :
మూడు కాలాల్లో సాగే కథనం ఇది. మూడు కాలాల్లోనూ ఒకే హీరో కనిపించడం ప్రత్యేకం కాకపోయినా.. ఆ పాత్రను ప్రత్యేకంగా కనిపించేలా రాసుకున్నాడు దర్శకుడు. మూడు కాలాలకూ ముడిపడిన విగ్రహం చుట్టూ నడిచిన కథనం బాగా ఆకట్టుకుంటుంది. మూడు పాత్రలకూ రాసుకున్న కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. అయితే కుంజికేలుకు మణియన్ కు ఉన్న సంబంధం స్పష్టంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. అలాగే అజయ్ ఎపిసోడ్ కాస్త సాగదీతలా కనిపిస్తుంది. అయితే టైటిల్ కు ఈ పార్ట్ లో జస్టిఫికేషన్ లేదు. అజయ్ చేసిన రెండో దొంగతనం అనే టైటిల్ ను సెకండ్ పార్ట్ కు సెట్ చేసుకున్నారు. మరి ఫస్ట్ దొంగతనం ఏంటీ అనేది సినిమాలోనే చూడాలి. మూడు పాత్రలనూ డిజైన్ చేసిన విధానం బావుంది. ముఖ్యంగా మణియన్ పాత్రలో విగ్రహాన్ని దొంగిలించే సీన్, అజయ్ క్యారెక్టర్ లో కలరి ఫైట్ నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తాయి.
అద్బుతమైన కథనం అయితే లేదు కానీ ఖచ్చితంగా ఓ కొత్త ఫీల్ ను క్రియేట్ చే సినిమా ఇది. మణియన్, అజయ్ పాత్రలను చివరి వరకూ తీసుకువెళ్లిన విధానంలో వచ్చే ఫైట్, తర్వాత వేర్వేరు కాలాల్లో ఇద్దరూ ఓ వాటర్ ఫాల్ కు చేరడం అనేది కంపేరిటివ్ గా చూపిస్తూ అద్భుతం అనిపించాడు దర్శకుడు. ఇలాంటి షాట్స్ చాలానే కనిపిస్తాయి. అలాగే అసలు గుడికే రావొద్దు అన్న తన తల్లి చేతే అసలు విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించేలా చేయడం అనే ఫినిషింగ్ టచ్ అదుర్స్ అని చెప్పాలి. అక్కడక్కడా కాంతార ఫ్లేవర్( కొన్ని జూనియర్ ఆర్టిస్ట్ పాత్రల వల్ల కాదు) తాత, మనవడి పరంపరలోకనిపిస్తుంది. అందువల్ల కేరళ పురాతన కల్చరల్ టచ్ కూడా యాడ్ అయింది.
కొన్ని కథలు చాలా విషయాలు చెబుతుంటాయి. అవి అంతర్లీనంగా ఉంటూనే అనేక అర్థాలను ఇస్తాయి. ఎక్కడో మొదలైన కథనం ఎక్కడికో చేరి.. ఇంకెక్కడికో వెళ్లబోతోంది అనే క్లైమాక్స్ తో బాగా ఆకట్టుకున్నాడు దర్శుకడు జతిన్ లాన్. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో ఇలాంటి కథలు చెప్పడం అంత సులువేం కాదు. ఏ పాయింట్ మిస్ అయినా ఓవరాల్ గా మైనస్ అవుతుంది. ఈ విషయంలో స్క్రీన్ ప్లే రైటర్ సుజిత్ నంబియార్ కు హండ్రెడ్ మార్క్స్ వేయొచ్చు. ఓ కొత్త నేపథ్యంలో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
నటన పరంగా టోవినో థామస్ జీవించేశాడు. మూడు పాత్రల్లోనూ అదరగొట్టాడు. అజయ్ గా అమాయకత్వం చూపుతూనే అవసరాన్ని బట్టి వీరత్వం ప్రదర్శించడంలో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. మణియన్ రోల్ అయితే జీవించేశాడు. కృతిశెట్టిది అంత ఇంపార్టెంట్ రోల్ కాదు. రొటీన్ గా హీరో కు లవ్ ఇంట్రెస్ట్ అంతే. రోహిణి, సురభి లక్ష్మిల నటన సహజంగా ఉంది. జగదీష్ నవ్వించే ప్రయత్నం చేశాడు. నంజప్పగా ప్రమోద్ శెట్టి ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రలన్నీ నటన పరంగా బావున్నా.. ఆ నటులు మనకు పెద్దగా తెలియకపోవడంతో అలా వదిలేయాల్సి వస్తుందంతే.
టెక్నికల్ గా చూస్తే.. ఈ మూవీ హై స్టాండర్డ్స్ లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అద్భుతం అయితే.. ఎక్కడా డౌట్ రాకుండా విఎఫ్ఎక్స్ నేచురల్ గా ఉంటాయి. ఇక నేపథ్య సంగీతం మరో హైలెట్. సెట్స్, ఆర్ట్ వర్క్, యాంబియన్స్, సెట్ ప్రాపర్టీస్.. ఇవన్నీ ఆయా కాలాలకు తగట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఆ మేరకు ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఎడిటింగ్ బావుంది.
దర్శకుడుగా జితిన్ డిస్టింక్షన్ లో మార్కులు కొట్టేశాడు. టైటిల్ జస్టిఫికేషన్ సెకండ్ పార్ట్ కు షిఫ్ట్ చేయడం మంచి ఐడియానే కానీ.. ఆ ఐడియాకు ఈ షార్ట్ ఫామ్ లో ఉన్న ఏఆర్ఎమ్ అనే టైటిల్ మైనస్ అవుతుంది. ఒరిజినల్ టైటిల్ కు తగ్గట్టుగా ఆ మీనింగ్ కన్వే అయ్యేలా అన్ని భాషల్లో కనీసం క్యాప్షన్ లా పెట్టినా కామన్ ఆడియన్స్ కు క్లియర్ గా అర్థం అవుతుంది.
ఫైనల్ : అజయ్ మొదటి దొంగతనం బావుంది
రేటింగ్ : 2.75/5
- బాబురావు. కామళ్ల
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com