Baby Telugu Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ

Baby Telugu Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ
మనసును మెలిపెట్టిన బేబీ

ఈరోజే రిలీజ్ అయిన ముక్కోణపు ప్రేమ కధా చిత్రం బేబీ. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర చేశారు. కె ఎన్ నిర్మాతగా, సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ బేబీ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఓ ఆటో డ్రైవర్. తన బస్తీలో తన ఎదురింట్లో ఉండే వైష్ణవి (వైష్ణవి చైతన్య) అనే అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాడు. వైష్ణవి కూడా ఆనంద్ ని ప్రేమిస్తుంది. అయితే ఖర్మ కాలి ఆనంద్ టెన్త్ ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్ గా మారతాడు, వైష్ణవి పాస్ అయ్యి ఇంజనీరింగ్ లో కూడా జాయిన్ అవుతుంది. ఇక్కడే కాలేజీలో ఆమెకు విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఇంక అప్పటి నుంచి కాలేజీ జీవితం, విరాజ్ స్నేహం వైష్ణవిని ఎలా మార్చాయి అనేది మిగిలిన కథ.



కథలోని నేచురాలిటీ, ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్, ఆనంద్ పాత్రలోని ఎమోషన్స్, వైష్ణవి పాత్రలోని బలహీనతలు, కాలేజీ లైఫ్ లో మొదలయ్యే కొత్త కొత్త ఆలోచనలు సినిమాలో ప్రధాన ఎలిమెంట్స్ గా ఉండి సినిమా స్థాయిని పెంచాయి. పాఠశాల, కాలేజీల్లో ఈతరం ప్రేమ కథలు ఎలా ఉంటున్నాయి ?, చిన్న చిన్న పొరపాట్లు కారణంగా యువత తమ లైఫ్ ల్లో ఎలా బ్యాలెన్స్ తప్పి పోతున్నారనే కోణంలో సాగే సీక్వెన్సెస్ బాగా కుదిరాయి.

అలాగే ఆనంద్ దేవరకొండకి, వైష్ణవి చైతన్యకి మధ్య కెమిస్ట్రీ, కూడా బాగా అలరిస్తుంది. మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రకు ఆనంద్ పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ వైష్ణవి చైతన్య కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ తన నటనతో ఆకట్టుకోగా.. ఇక ఎప్పటిలాగే తండ్రి పాత్రలో కనిపించిన నాగబాబు కూడా బాగా నటించాడు. వైవా హర్ష, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.



అయితే స్లో నేరేషన్ మాత్రం సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ వర్క్, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఆనంద్ దేవరకొండ పై వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ సమయంలో ల్యాగ్ సీన్స్ లెంగ్త్ ను తగ్గించి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది.

Tags

Read MoreRead Less
Next Story