Bun Butter Jam Movie Review : బన్ బటర్ జామ్ మూవీ రివ్యూ

రివ్యూ : బన్ బటర్ జామ్
ఆర్టిస్ట్ లు : రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య థ్రిఖా, మైఖేల్ తంగదురై, శరణ్య పొన్ వన్నన్, చార్లీ, దేవ దర్శిని తదితరులు
ఎడిటింగ్ : జాన్ అబ్రహాం
సంగీతం : నివాస్ కే ప్రసన్న
సినమాటోగ్రఫీ : బాబు కుమార్
నిర్మాతలు : రెయిన్ ఆఫ్ యారోస్, సురేష్ సుబ్రమణియన్
దర్శకత్వం : రాఘవ్ మీర్దత్
యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కాకపోతే ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండాలి. అలా ఉంటే ఏ భాషా చిత్రమైనా ఆకట్టుకుంటుంది అని అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆ కోవలోనే ఈ వారం తమిళ్ నుంచి బన్ బటర్ జామ్ అనే సినిమా తెలుగులో డబ్ అయి విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ :
చంద్రం (రాజు జయ మోహన్) తల్లి వల్ల చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. పైగా ఓన్లీ బాయ్స్ స్కూల్స్ లోనే చదువుతాడు. అతనికి చిన్నప్పటి నుంచీ శ్రీనివాస్ (మైఖేల్) బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు. ఇద్దరూ బిటెక్ లో వేర్వేరు బ్రాంచ్ లలో జాయిన్ అవుతారు. అక్కడ చంద్రం నందిని(భవ్య థ్రిఖా)ను ప్రేమిస్తాడు. తనూ ప్రేమిస్తుంది. మరోవైపు చంద్ర తల్లి అతనికి మధు(అద్య ప్రసాద్) తో పెళ్లి చేయాలని.. ఆమె తల్లి సాయంతో వీరిద్దరూ లవ్ లో పడేయాలని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మధు మరో అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది. అదే టైమ్ లో చంద్ర తన ఫ్రెండ్ వల్ల నందినితో విడిపోవాల్సి వస్తుంది. మరి ఆ తర్వాతేమైంది.. చంద్ర, నందిని ఎందుకు విడిపోయారు.. చంద్రం తల్లి కోరుకున్నట్టుగా అతను మధుకు చేరువయ్యాడా.. మధు లవ్ సక్సెస్ అవుతుందా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
కొన్ని కథలు ఏ తీరం చేరతాయో ముందే ఊహించేయొచ్చు. కానీ ఆ తీరం వరకూ సాగే ప్రయాణం ఆసక్తికరంగా ఉండాలి. ఈ బన్ బటర్ జామ్ కథ కూడా అంతే. ముందుగా హీరో, హీరోయిన్ల తల్లుల ఇరిటేటింగ్ యాక్టింగ్ తో ప్రారంభం అవుతుంది. కానీ కాలేజ్ కు వెళ్లిన తర్వాత అక్కడ ప్రేమకథ, పాటలు, రొమాన్స్ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. చంద్ర, నందిని మధ్య లవ్ ట్రాక్ బావుంది. ఆ అమ్మాయి చూడ్డానికి అందంగా ఉంది. అక్కడ తన ఫ్రెండ్ కోసం చేసిన ఒక యాక్షన్ ఎపిసోడ్ బావుంది. తద్వారా చంద్రకు ఏర్పడిని ఓ సీనియర్ ఫ్రెండ్ సినిమాకు ప్లస్ అయ్యాడు. ఇక ఇటు తల్లుల కోరిక మేరకు మధు, చంద్రం లవర్స్ కాకపోయినా మంచి స్నేహితులవుతారు. ఇది కూడా ముందు గొడవపడి తర్వాత ఫ్రెండ్స్ అయ్యే కాన్సెప్టే. చంద్రం ఫ్రెండ్ పాత్ర ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఈ జెనరేషన్ కు కొత్తేం కాకపోవచ్చు. అందుకే ఈ జెనరేషన్ కు మూవీ బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అటు మధు అతని స్నేహితుడుతో సాగే లవ్ ట్రాక్ లో వచ్చే కామెడీ సూపర్ గా ఉంటుంది. ముఖ్యంగా అతను ఏసిలు బాగు చేసే వాడుగా మారాల్సి వచ్చే ఎపిసోడ్ హిలేరియస్ గా వర్కవుట్ అయింది. అక్కడక్కడా కొన్ని తమిళ్ మూవీస్ ఛాయలు కనిపించినా.. బన్ బటర్ జామ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎంగేజింగ్ గా కనిపిస్తుంది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, అంతే మెచ్యూర్డ్ రైటింగ్ కనిపిస్తాయి. లవ్ ఫెయిల్ కుర్రాళ్లు తాగి, దొర్లడం కాకుండా ఆ కోపాన్ని చదువుపైనే చూపించమని చెప్పే డైలాగ్ బావుంది. అది ఫాలో అయిన చంద్ర గోల్డ్ మెడల్ సాధించడం.. ఈ క్రమంలో తన మైండ్ మెచ్యూరిటీ ఇవన్నీ ఇన్స్ స్పైరింగ్ గానే ఉన్నాయి.
కాకపోతే ఫస్ట్ హాఫ్ లో మాత్రం చాలా అనవసరమైన సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా శరణ్య, దేవదర్శిని కనిపించిన ప్రతిసారీ అతి నటనతో అత్యంత చిరాకు పెట్టారు. ఆ ఎపిసోడ్స్ అన్నీ ఇరిటేటింగ్ గానే ఉన్నాయి. అలాగే నెరేషన్ సైతం కాస్త కన్ఫ్యూజింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో లవర్స్ మారడం అనేది కొంత వరకూ ఇబ్బంది పెట్టినా లాజికల్ గా చూస్తే ఓకే అనిపిస్తాయి. కాకపోతే ఈ పాయింట్ కరెక్ట్ గా కనెక్ట్ అవడం ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యంగా యూత్ ఫుల్ సినిమా కాబట్టి అనే పేరుతో ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుందీ చిత్రం.
నటన పరంగా రాజు జయమోహన్ బాగా నటించాడు. తన పాత్రను ఓన్ చేసుకున్నాడు. లుక్స్ కాస్త ఇబ్బందిగా ఉన్నా.. ముందుముందు సెట్ అవుతాడనిపిస్తాయి. హీరోయిన్లు ఆద్య ప్రసాద్, భవ్య ఖాథ్రి ఇద్దరూ చాలా అంటే చాలా బాగా నటించారు. శ్రీనివాస్ పాత్రలో మైఖేల్ తంగదురై సెటిల్డ్ గా కనిపించాడు. శరణ్య, దేవదర్శిని ఇద్దరిదీ బాగా ఓవరాక్షన్. మధు లవర్ పాత్రలో చేసిన విజే పప్పు బాగా నటించాడు. ఇతర పాత్రలన్నీ ఓకే.
టెక్నికల్ గా మంచి నేపథ్య సంగీతం కుదిరింది. పాటలు చాలా బావున్నాయి. పాటల్లోని తెలుగు సాహిత్యం ఇంకా బావుంది. డబ్బింగ్ బావుంది. సినిమాటోగ్రఫీ ప్లజెంట్ గా కనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొంత వరకు తీసేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా రాఘవ్ మీర్దత్ ఈ చిత్రాన్ని ఈ జెనరేషన్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు కనిపించినా.. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే అంశాలున్నాయి.
ఫైనల్ గా : బన్ బటర్ జామ్.. టేస్ట్ ఫుల్ ఎంటర్టైనర్
రేటింగ్ : 2.75/5
- బాబురావు. కామళ్ల
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com