Committee Kurrollu Review : కమిటీ కుర్రోళ్లు మూవీ రివ్యూ

Committee Kurrollu Review : కమిటీ కుర్రోళ్లు మూవీ రివ్యూ
X

రివ్యూ : కమిటీ కుర్రోళ్లు

తారాగణం : సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్, త్రినాథ్ వర్మ, రాధ్య, తేజస్విని రావు, టీనా శ్రావ్య

ఎడిటర్ : అన్వర్ అలీ

సంగీతం : అనుదీప్ దేవ్

డివోపి : రాజు ఎదురోలు

నిర్మాత : నిహారిక కొణిదెల

దర్శకత్వం : యదు వంశీ

నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా మారి రూపొందించిన సినిమా కమిటీ కుర్రోళ్లు. అంతా కొత్తవాళ్లతోనే తెరకెక్కిన ఈ మూవీని యదు వంశీ డైరెక్ట్ చేశాడు. మంచి ప్రమోషన్స్ తో ఈ మూవీ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ప్రమోషన్స్ లో కనిపించిన హడావిడీ సినిమాలో ఉందా అనేది చూద్దాం.

కథ :

వెస్ట్ గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి అనే ఊరిలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో ఒక తరం కుర్రాళ్లు ఓ 10 -15 మంది వరకూ ఉంటారు. అందమైన బాల్యాన్ని చూస్తారు. ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు. అప్పటి వరకూ జాతి, మతం అంటూ ఏం లేకుండా పెరిగిన వారి మధ్య ఎమ్ సెట్ ర్యాంక్ రూపంలో క్యాస్ట్ గురించిన తారతమ్యాలు వస్తాయి. అవి కాస్తా ముదిరి.. వర్గాలుగా విడిపోయే వరకూ వస్తాయి. ఇక ఆ ఊరిలో ప్రతి 12యేళ్లకు ఓ సారి బరెంకలమ్మ జాతర రోజున వీరి గొడవ ముదిరి జాతరలోనే కొట్టుకుంటారు. ఆ గొడవకు రాజకీయంగా ఆజ్యం పోస్తాడు ప్రెసిడెంట్ బుచ్చి. గొడవ పెరుగి ఊరి మధ్య తోపులాట మొదలవుతుంది. ఆ తోపులాటలో వీరి గ్యాంగ్ కే చెందిన ఆత్రం అనే ఫ్రెండ్ కాలవలో పడ చనిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది. వీరి స్నేహం కొనసాగిందా.. ఆత్రం కుటుంబం ఏమైంది.. ఊరి జాతర కొనసాగుతుందా అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

పేపర్ పై అందంగా ఉన్న కథలు వెండితెరపై అంతే అందంగా కనిపించాలనేం లేదు. ఇలాంటి నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇవ్వాలనే కోణంలో అనేక సినిమాలు చూశాం. బాల్యం, యవ్వనం, ప్రేమలు, విడిపోవడాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు.. ‘ ఆ రోజులే బావున్నాయి..’ అనిపించే జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి కొన్ని సినిమాలు. ఇదీ ఆ కోవలోకే వచ్చే సినిమా. కాకపోతే ఇతనే హీరో అని చెప్పడానికి లేకుండా అందరికీ సమానమైన పాత్రలే ఉన్నాయి. వీరి చిన్నతనం.. తర్వాత టీనేజ్ లవ్ స్టోరీస్.. అనుకోకుండా ‘కులం’ కారణంగా ఎడబాటు.. జాతరలో యాక్షన్ సీక్వెన్స్.. ఇదంతా ఫస్ట్ హాఫ్ లో సాగిపోతుంటాయి. జాతరలో వచ్చే యాక్షన్ కొరియోగ్రఫీ, యాక్టింగ్, టేకింగ్, మేకింగ్ చాలా బావున్నాయి. కానీ కథలో ప్రధానమైన కాన్ ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యే సెకండ్ హాఫ్ సడెన్ గా పడిపోతుంది. అదే పనిగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం.. ఒక్కొక్కరి కథలు చెప్పుకుంటూ వెళ్లడం.. ఓ దశలో సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకున్న తర్వాత కథలో బలమైన సంఘర్షణ స్టార్ట్ అవుతుందనుకుంటే ఇంటర్వెల్ తర్వాత ఆ అంశాన్నే వదిలేశాడు దర్శకుడు. పైగా చివర్లో ‘నిజమేరా మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి అయినప్పుడు నాకు రిజర్వేషన్ ఎందుకు..’ అంటూ ఓ దళిత కుర్రాడితో చెప్పించిన డైలాగ్ దర్శకుడికి రిజర్వేషన్ పై కనీస అవగాహన లేక ‘అక్కసు’ వెళ్లగక్కాడు అనిపిస్తుంది. అలాగే జాతి తక్కువ నా కొడుకులు అంటూ పదే పదే చెప్పింది.. ఆ పాయంట్ నూ వదిలేశాడు.

పన్నెండేళ్ల తర్వాత తమ కారణంగా ఆగిపోయిన జాతరను జరిపించే బాధ్యత తీసుకుని.. అప్పటి వరకూ ఉన్న విభేదాలను పక్కన బెట్టి అంతా ఒక్కటై ముందుకు కదలడం వరకూ బానే ఉంది. కానీ కథనమే ఎంతకీ కదలదు. చాలా ఎమోషనల్ గా ఉండాల్సిన జాతర సీన్ ను అలా తేల్చేశారు. అక్కడితో సినిమా అయిపోయిందీ అనుకుంటే.. మళ్లీ ఎలక్షన్ అంటూ మరింత ‘లాగదీత’. పోనీ క్లైమాక్స్ ఏమైనా కన్విన్సింగ్ గా ఉందా.. అంటే అస్సలు లేదు. ఓటుకు నోటు అనే పాయింట్ తో రాయించిన పాట చేయించిన ప్రహసనం విసుగు తెప్పిస్తుంది. మొత్తంగా ఫస్ట హాఫ్ లో ఇంటర్వెల్ కు ముందు అరగంట సినిమా బావున్నట్టు కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయింది.

ఒకే కథలో స్నేహం, ప్రేమ, జాతర, రాజకీయాలు, కులాలు, రిజర్వేషన్స్.. ఇలా ఇన్ని అంశాలు చెప్పాలని ప్రయత్నించిన దర్శకుడు యధు వంశీ ఎందులోనూ సక్సెస్ కాలేక చేతులెత్తేశాడు. దీనికి నోస్టాల్జియా అని పేరు పెడితే.. ఇంకేం చెప్పలేం కానీ.. 90ల తర్వాత ఎవరి బాల్యంలో అయినా ఈ మూవీలో చూపించినవి కామన్ గానే కనిపిస్తాయి. అందులో పురుషోత్తంపల్లి ప్రత్యేకత అంటే జాతర మాత్రమే. ఆ జాతరను కన్నుల పండగలా జరిపించడంలో కమిటీ కర్రోళ్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

నటన పరంగా అందరూ బాగా చేశారు. ఎవరికి వారు ది బెస్ట్ ఇచ్చారు. క్యారెక్టర్స్ ను అర్థం చేసుకుని నటించారు.

టెక్నికల్ గా ఒకట్రెండు పాటలు బానే ఉన్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ ఇంకా ట్రిమ్ చేసి ఉండాల్సింది. డైలాగ్స్ బావున్నాయి. అప్పటి కాలాని తగ్గట్టుగా కాస్ట్యూమ్స్, సెట్స్ బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా పాతదే. అయినా దాన్ని కొత్తగా చెప్పడంలో విఫలం అయ్యాడు.

ఫైనల్ గా : అంత బలమైన కమిటీ కాదు

రేటింగ్ : 2.5/5

- బాబురావు కామళ్ల

Tags

Next Story